610Main1

మోదీ సర్కార్‌ తీరు నిరంకుశం,అహేతుకం – సుప్రీం కోర్టు

 

🔹వ్యాక్సిన్లు అమ్మడం సహేతుకం
🔹కోవిన్ పైన కోర్టు ఫైర్
🔹వాక్సినేషన్ కు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశం

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశంలో కరోనా మహమ్మారి వల్ల ప్రతిరోజూ వేలాది మంది చనిపోతుండగా, మరణాలకు అడ్డుకట్ట వేయదగిన వ్యాక్సినేషన్ ప్రక్రయ పూర్తి గందరగోళంగా మారిన పరిస్థితిలో.. కొవిడ్ సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా చేపట్టిన విచారణ సంచలన మలుపులు తిరుగుతున్నది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్రం అవలంభిస్తున్న విధానాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. మోదీ సర్కారు తీరు నిరంకుశంగా, అహేతుకంగా ఉందని మండిపడింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ ధర్మాసం ఈ మేరకు బుధవారం అనూహ్య వ్యాఖ్యలు చేసింది.కేంద్రం తన వ్యాక్సినేషన్ విధానంలో భాగంగా 45 ఏళ్లు దాటిన వాళ్లకు ఉచితంటా టీకాలు అందిస్తూ, 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి మాత్రం రుసుము వసూలు చేయడం సహేతుకం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ జనాభాలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్లే ఎక్కువ ఉండటాన్ని గుర్తుచచేస్తూ.. కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో ఎక్కువ మంది బాధితులు ఈ వయస్సు వారేనని, వైరస్‌ ప్రభావం కూడా వీరిపై ఎక్కువగానే ఉందని, చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, అలాంటప్పుడు ఈ ఏజ్ గ్రూపు వారికి ఉచిత వ్యాక్సిన్లు ఇవ్వబోమని కేంద్రం చెప్పడం కచ్చితంగా నిరంకుశత్వమే అవుతందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

వ్యాక్సినేషన్‌ విధానం, దాని అమలులోనూ చాలా లోపాలు ఉన్నాయనీ, వెంటనే వాటిని సమీక్షించి, నివృత్తి చేసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం నాటి విచారణలో.. డిసెంబరు 31 నాటికి అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. ఎలా ముందుకెళ్తారన్న దానిపై రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని సుప్రీం బుధవారం ఆదేశించింది. వ్యాక్సిన్‌ ధరలపై కేంద్రం మరోసారి పరిశీలించాలని చెప్పింది. వైరస్‌లో మార్పులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో 18-44 వయస్సు వారికి కూడా వ్యాక్సిన్‌ వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది శాస్త్రీయపద్ధతుల ద్వారా నిర్ణయించాలని కోర్టు స్పష్టం చేసింది. సరళీకృత టీకాల విధానంలో కొందరు వ్యక్తులు టీకాల కోసం డబ్బులు చెల్లించాల్సి రావడం తగదని, ఆయా వయసుల వారికి పరిమిత సంఖ్యలో టీకాలను రాష్ట్రాలు, యూటీలకు సరఫార చేసి, డిజిటల్ రిజిష్ట్రేషన్ ఉంటేనే తప్ప వ్యాక్సిన్లు వేయబోమని చెప్పడం నిజంగా లోపభూయీష్టవిధానానికి తార్కాణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంత పెద్ద దేశంలో ఒకే ఒక్క డిజిటిల్ ప్లాట్ ఫామ్ కొవిన్ ద్వారా వ్యాక్సినేష్ ప్రక్రియ మొత్తాన్ని నిర్వహిస్తామనడం సరికాదంది. కొవిన్ ను అందరికీ చేరవేసే మార్గాలను అణ్వేషించాలని, అన్ని సమూహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.