nirmala Sitaraman

 

మౌలిక రంగ ఆస్తుల అమ్మకం

 

🔹కేంద్రం కీలక నిర్ణయం
🔹జాబితాలో ఎయిర్‌పోర్టులు ?

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, బడ్జెట్ లోటును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టనుంది. రానున్న నాలుగేళ్లలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తులను విక్రయించడం ద్వారా 6 ట్రిలియన్ డాలర్లు (81 బిలియన్ డాలర్లు) నిధులను సేకరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో రోడ్డు, రైల్వే ఆస్తులు, విమానాశ్రయాలు, పవర్ ట్రాన్స్‌మిషన్ విభాగాలు, గ్యాస్ పైప్‌లైన్‌ల విక్రయాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో వెల్లడించనున్నారని అధికార వర్గాల సమాచారం. ఈ విక్రయాలు ప్రణాళిక ప్రకారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని సంస్థలే ఉంటాయని, మిగతా వాటిని ప్రైవేటుపరం చేస్తామని గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ (డిస్ ఇన్వెస్ట్‌మెంట్) విధానానికి అనుగుణంగా తాజాగా మౌలిక రంగ ఆస్తుల అమ్మకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి కారణంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఈ లోటును భర్తీ చేయడానికి 2022 మార్చి వరకు ఆస్తుల అమ్మకాల ద్వారా రూ.1.75 ట్రిలియన్‌లు సమీకరించాలని కేంద్రం భావిస్తోంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీఓతో పాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఎయిర్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీల్లో వాటాల విక్రయం.. వంటి నిర్ణయాలు డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలో భాగంగా ఉన్నాయి. అయితే మౌలిక విభాగాలకు చెందిన ఆస్తుల అమ్మకాల కోసం మాత్రమే ప్రస్తుత ప్రణాళికలు ఉండే అవకాశం ఉంది. 11 మంత్రిత్వ శాఖల పరిధిలో ఈ ఆస్తులు ఉన్నట్లు అంచనా. రోడ్డు, రవాణా విభాగ ఆస్తుల అమ్మకం ద్వారా రూ.1.6 ట్రిలియన్లు, రైల్వేల ఆస్తుల అమ్మకం ద్వారా రూ.1.5 ట్రిలియన్ల వరకు ఆదాయం రావచ్చని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విద్యుత్ రంగ ఆస్తుల అమ్మకం ద్వారా రూ.1 ట్రిలియన్లు, గ్యాస్ పైప్‌లైన్‌ల అమ్మకం ద్వారా రూ.590 బిలియన్లు, టెలికమ్యూనికేషన్ ఆస్తుల అమ్మకం ద్వారా 400 బిలియన్లు పొందవచ్చని సదరు అధికారి అంచనా వేశారు. పబ్లిక్ వేర్‌హౌజ్‌లు, పౌర విమానయానం, పోర్టు మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ స్టేడియంలు, మైనింగ్ ఆస్తుల అమ్మకాల ద్వారా మొత్తం రూ.1 ట్రిలియన్ వరకు ఆర్జించవచ్చని తెలిపారు. అయితే ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన మానిటైజేషన్ ప్లాన్‌.. ప్రభుత్వ ఆస్తుల విక్రయం కార్యక్రమానికి మీడియం టర్మ్ రోడ్ మ్యాప్‌గా ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్తుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం దేశ బడ్జెట్ లోటును తగ్గిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ బడ్జెట్ లోటు గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 9.3 శాతంగా ఉండగా.. ఈ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఇది 6.8 శాతానికి పరిమితమవుతుందని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ అంచనాలు చేరుకోవడం కష్టమని పలువురు ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.