supreme court

 

రాజద్రోహం చట్టం ఇంకా అవసరమా.?

 

🔹బ్రిటిష్ కాలంనాటి చట్టం ఇంకెందుకు.?
🔹కేంద్రానికి సుప్రీంకోర్టు సూటి ప్ర‌శ్న

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదుచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.  వ‌ల‌స‌పాల‌న‌నాటి చ‌ట్టాలు ఇంకా అమ‌లు చేస్తుండ‌టంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. స్వాతంత్ర‌ పోరాటాన్ని అణ‌చివేయ‌డానికి బ్రిటీషు పాల‌కులు ఉప‌యోగించిన సెక్ష‌న్ 124 ఏ ను ఇంకా ఎందుకు ర‌ద్దు చేయ‌లేద‌ని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. ఈ సెక్ష‌న్ దుర్వినియోగమ‌వుతున్న తీరుపై జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాసనం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కు అయిన మాట్లాడే హ‌క్కును కాల‌రాస్తున్న ఈ సెక్షన్ చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను స‌వాలు చేస్తూ.. రిటైర్డ్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌జీ వోంబాట్కేర్ పిటీషన్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ రాజ‌ద్రోహ చ‌ట్టం స్వాతంత్రోద్య‌మాన్ని అణ‌చివేసేందుకు బ్రిటీష‌ర్లు తీసుకువ‌చ్చారు. మ‌హాత్మాగాంధీ లాంటి స్వాతంత్ర పోరాట యోధుల గొంతు నొక్క‌టానికి ఈ చ‌ట్టాన్ని ఉప‌యోగించార‌ని ధ‌ర్మాస‌నం గుర్తు చేసింది. దీనిపై అటార్నీ జ‌న‌ర‌ల్ కెకె వేణుగోపాల్ స్పందిస్తూ ఈ చ‌ట్టం దుర్వినియోగం కాకుండా కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ‘ఒక వ‌డ్రంగి త‌ను చేయ‌ద‌లుచుకున్న వ‌స్తువు కోసం ఒక‌చెట్టును న‌ర‌క‌డానికి బ‌దులుగా అడ‌వంతా న‌రికితే ఎలా ఉంటుందో.. ఈ చ‌ట్టం అమ‌లు చేసిన తీరుకూడా అలాగే ఉంది. ఈ చ‌ట్టానికి ఉన్న అధికారం అటువంటిది’ అని చీఫ్ జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తాను ఏ ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌ట్ట‌డం లేద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికే సెక్ష‌న్ 124 రాజ్యాంగ బ‌ద్ధ‌త‌ను స‌వాలు చేస్తూ అనేక కేసులు సుప్రీం కోర్టు ముంగిట ఉన్నాయి. అయితే రిటైర్డ్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌జీ వోంబాట్కేర్ వేసిన కేసు మాత్రం వీటన్నింటికంటే భిన్న‌మైన‌ది. సెక్ష‌న్ 124 కింద న‌మోదైన కేసుల‌న్నింటినీ కొట్టివేయాలంటూ ఆయ‌న సుప్రీం కోర్టు గ‌డ‌ప తొక్కారు. 1962లో సుప్రీం కోర్టు ఈ చ‌ట్టాన్ని స‌మ‌ర్థించింది. అయితే అప్పుడు దేశంలోని ప‌రిస్థితులు వేరు. ప్ర‌స్తుతం ఈ చ‌ట్టం ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగ‌క‌రంగా మారింది. క‌నుక దీనిని స‌మీక్షించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో అభ్య‌ర్థించారు.

సెక్ష‌న్ 124 ఏ ఏం చెబుతోంది..?
‘మాటలతో కానీ, చేతలతో కానీ, సంకేతాలతో కానీ, ప్రదర్శనలతో కానీ, మరే విధంగానైనా కానీ.. భారతదేశంలో చట్టబద్ధంగా నియమితమైన ప్రభుత్వం పట్ల అవిధేయతను, విద్వేషాన్ని, శత్రుభావనలను ప్రేరేపించినా.. లేదా ప్రేరేపించటానికి ప్రయత్నించినా.. వారు శిక్షకు అర్హులు. వీరికి జైలు శిక్ష లేదా జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో శిక్షతో పాటు జరిమానా విధించి శిక్షించవచ్చు” అని ఐపీసీ సెక్షన్ 124 (ఏ) చెబుతోంది. ఇది నాన్‌బెయిల‌బుల్ సెక్ష‌న్‌. 1922లో మహాత్మాగాంధీని కూడా ఈ దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేశారు. యంగ్ ఇండియా పత్రికలో ఆయన రాసిన వ్యాసాలకు గాను ఈ కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా ”పౌరుడి స్వేచ్ఛను అణచివేయటానికి రూపొందించిన చట్టం ఇది” అని మహాత్మాగాంధీ అన్న మాట చాలా ప్రసిద్ధి చెందింది.