revanth

 

రాష్ట్రమంతా ఉపఎన్నికలు రావాలి

 

🔹కొత్త పథకం రావాలంటే ఉప ఎన్నికలు రావాల్సిందేనా
🔹‘ఇస్తవా.. చస్తవా’ అనే నినాదంతో రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఇంద్రవెల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆదివాసీలు, దళితులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని ఏఐసీసీ కార్యక్రమాలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి వెళ్లారు రేవంత్ రెడ్డి, సోమవారం నిర్వహించతలపెట్టిన ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లు, ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉపఎన్నికలో రాజకీయ లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తీసుకురావాలంటే ఉపఎన్నిక రావాల్సిందేనా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉపఎన్నికలు రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని రేవంత్ ఎద్దేవా చేశారు. నేటి నుంచి సెప్టెంబర్ 17 వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ‘ఇస్తవా.. చస్తవా’ అనే నినాదంతో ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ మొదటివారంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో మరో నాలుగైదు ప్రాంతాల్లో ఇంద్రవెల్లి లాంటి బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రేవంత్ చెప్పారు. నేటి సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరకు సంబంధించిన సమీక్ష నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి వచ్చారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలో మరో నాలుగైదు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. రేపటి ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్షకు పైగా కాంగ్రెస్ శ్రేణులతో సభవను విజయవంతం చేస్తామన్నారు. నేటి సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందన్నారు మహేశ్వర్ రెడ్డి.