Jagaaan

 

రాష్ట్ర హక్కుల కోసం ఎందాకైనా వెళ్తా – సీఎం జగన్

 

🔹ఏపీ ప్రజలు ఉన్నారనే సంయమనం
🔹సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపు
🔹ప్రధానికి ఫిర్యాదు చేస్తూ లేఖ

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ సాగింది. ఆ సమయంలో మఖ్యమంత్రి జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కేబినెట్ లో రాయలసీమ ఎత్తి పోతల గురించి..తెలంగాణ చేస్తున్న వాదన గురించి మంత్రులకు వివరించారు. తీర్పులు..ఒప్పందాలకు వ్యతిరేకంగా ఒక్క చుక్క నీటిని కూడా వినియోగించుకోవటం లేదని స్పష్టం చేసారు. అదే సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసారు. రాష్ట్రానికి దక్కాల్సిన చుక్క నీరు కూడా వదులుకొనేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసారు. శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరిని ఏపీ కేబినెట్‌ తప్పుబట్టింది. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యవహారం పైన పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారు.. వాళ్లకు ఇబ్బంది కలగకూడదనే సంయమనంతో ఉన్నామంటూ సీఎం కీలక వ్యాఖ్య చేసినట్లు సమాచారం. తెలంగాణలో వారు ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ ముఖ్యమంత్రి తన సహచర మంత్రులకు వివరించారు. ఆ సమయంలో మరో మంత్రి తెలంగాణ భూ భాగంలో ఆ రాష్ట్రం అక్రమంగా ఎనిమిది ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అన్ని సమస్యలను అపెక్స్ కౌన్సిల్ ద్వారా పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరో సారి జోక్యం చేసుకున్న సీఎం జగన్.. శ్రీశైలం విద్యుత్పత్తి ఆపేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి మరో లేఖ రాయాలంటూ అధికారులను ఆదేశించారు. ఇక, ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వానికి వ్యూహాలు ఉన్నాయని..రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైన రీతిలో వ్యవహరిస్తుందంటూ మంత్రులు చెబుతున్నారు. ప్రధానికి ఈ వివాదం పైన ముఖ్యమంత్రి లేఖ రాయనున్నారు. కేబినెట్ చేసిన తీర్మానం జత చేసి ఈ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది.