Revanth Reddy

 

రేవంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మద్య వాగ్వాదం.!

 

🔹సర్ధిచెప్పిన రాజనర్సింహ.!

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కాంగ్రెస్ పార్టీలో వివాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు, భిన్నాభిప్రాయాలు, అసంతృప్తి జ్వాలలు అసహనం వ్యక్తం చేయడం సర్వసాధారణం. కాని అలాంటి ఘటనలన్నీ మొన్నటి వరకు. రేవంత్ రెడ్డి అద్యక్షుడు అయిన తర్వాత ఇలాంటి ఘటనలకు చెక్ పెడతారని, ఐకమత్యంతో పార్టీ నేతలు ముందుకు వెళ్తారని అందరూ భావించారు. కాని అలా జరగలేదు. మీడియా ముందు, పార్టీ ముఖ్య నేతల ముందు స్వయంగా పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఈ సంఘటనతో పార్టీ క్యాడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అనుకున్నారు అందరూ. నూతన కార్యవర్గంతో పార్టీలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని అందరూ భావించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన దగ్గరనుండి కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. గాంధీ భవన్ లో పదుల సంఖ్యలో కనిపించే కార్యకర్తలు రేవంత్ రెడ్డి నింపిన ఉత్సహాంతో వందల మంది పార్టీ శ్రేణులు కనిపిస్తున్నారు. కొత్త ఉత్సాహంతో పార్టీ ముందుకు వెళ్తున్నట్టు నాయకులు కూడా అంగీకరించిన సందర్బాలు ఉన్నాయి.

రేవంత్ రెడ్డి పీసిసి పగ్గాలు చేపట్టడంతో పార్టీ ముఖ్య నేతల్లో అసంతృప్తి నెలకొంటుందని, రేవంత్ రెడ్డి సారథ్యాన్ని చాలా వరకు ఆమోదించరనే సందేహాలు కూడా క్యాడర్ లో నెలకొన్నాయి. కాని ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో తెలిసిన రేవంత్ రెడ్డి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, తన పర భేదం లేకుండా పార్టీ నేతలందరిని వ్యక్తిగతంగా సంప్రదించి ఐకమత్యంగా పనిచేసి పార్టీని విజయతీరాలకు చేర్చుదాం అని అభ్యర్ధించారు. దీంతో చాలా వరకు ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి అభ్యర్ధనను ఆమోదించి సానుకూలత వ్యక్తం చేసారు. అంతే కాకుండా జెట్ వేగంతో దూసుకుపోయే రేవంత్ రెడ్డి విధానాలతో పార్టీ ముఖ్యనేతలందరూ ఏకీభవించి ఆయనతో కలిసి ముందుకు వెళ్తారనే విశ్వాసాన్ని కూడా నేతలు వ్యక్తం చేసారు. కాని రేవంత్ రెడ్డి టీపీసిసి పగ్గాలు చేపట్టి నెలరోజులు కాకముందే చిన్న పాటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోడు భూముల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ గిరిజన నేతలు సమావేశంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. దీంతో కాంగ్రెస్ నాయకులతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కూడా మీడియా ముందు ఇలాంటి వివాదాలు ఎందుకునే చర్చ వినిపించింది.

ఇందిరా భవన్ లో గిరిజన నేతలు సమావేశంలో పాల్గొన్న పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగస్టు తొమ్మిద గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంద్రవల్లి లో బహిరంగ సమవేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద సమర శంఖారావం పూరిస్థామని ప్రకటించారు. ఇదే సమయంలో ఏఐసీసీ కార్యక్రమాలు అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకుని జిల్లా నేతలకు కనీసం సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని ఎలా ప్రకటిస్తారని రేవంత్ రెడ్డిని సభాముఖంగా ప్రశ్నించారు. దీంతో ఇంద్రవల్లితో నీకేం సంబంధం మహేష్.? నీవు కేవలం నిర్మల్ వరకే పరిమితమవ్వు అంటూ రేవంత్ రెడ్డి సమాధానాం చెప్పారు. అలా ఎలా కుదురుతుందని మహేశ్వర్ రెడ్డి వాగ్వాదానికి ఉపక్రమించారు. దీంతో రేవంత్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి మద్య మాట మాట పెరిగింది. వెంటనే పార్టీ సీనియర్ నేత దామోదర రాజర్సింహ జోక్యం చేసుకుని మహేశ్వర్ రెడ్డిని వారించడంతో వాగ్వాదం సర్థుమనిగింది. ఈ పరిణామంతో పార్టీ నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలాంటి సంఘటను పునరావృత్తం కావొద్దని, నేతల సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్దామని రేవంత్ ముఖ్య నేతలకు సూచించారు.