రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన…
🔹కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హ్యాపీ
కొంతకాలంగా స్తబ్తుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మళ్లీ పుంజుకుంటున్నాయా… రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందా… ఆయన తాజాగా ప్రకటించిన నిర్ణయమేంటి?
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక… రేవంత్ రెడ్డి జోరు పెంచారు. మొదటి నుంచి టీఆర్ఎస్‌పై దూకుడుగానే ఉన్న ఆయన… ఇప్పుడు ఏకంగా పీసీసీ చీఫ్ అవ్వడంతో… ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. దానికి తోడు హుజూరాబాద్ బైపోల్ కూడా ఉండటంతో… అందివచ్చే ప్రతి అవకాశాన్నీ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత వచ్చేలా మలచుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొప్పోలులో ఈ నెల 13న ఓ అమ్మాయి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన అంశంపై రేవంత్ ఫోకస్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫోన్ కాల్ చేసి మృతురాలి తండ్రి దశరథను పరామర్శించారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ నుంచి రూ.50,000 ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు… బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే… ఈ కేసులో దోషులకు కఠినంగా శిక్షపడేలా చేస్తామని, దీనిపై కేంద్ర హోంశాఖా మంత్రికి కంప్లైంట్ చేస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ శ్రేణులకు ఒకింత ఉత్సాహం ఇచ్చింది. ప్రభుత్వం కంటే ప్రతిపక్షంగా ఉన్న తామే… బాధితులను ఆదుకుంటున్నామనే సంకేతం ప్రజల్లోకి వెళ్తోందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే కాదు తాజాగా ప్రభుత్వం జరిపిన కోకాపేట భూముల అమ్మకాల్లో రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించడం తీవ్ర కలకలం రేపింది. ఓవైపు ప్రభుత్వమేమో… అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బంతా తెలంగాణ అభివృద్ధికీ, ప్రజా సంక్షేమానికీ ఖర్చు చేస్తామని ప్రకటించగా… అసలు ఆన్‌లైన్ వేలంలో ఇతరులు ఎవరు పాల్గొనకుండా అధికారులు బెదిరించారని ఆరోపించారు. ఇందుకు సీఎస్ సోమేష్ కుమార్‌తోపాటు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు సహకరించారని అన్నారు. ఈ ఇద్దరి బాగోతాలనూ త్వరలో బట్టబయలు చేస్తానన్నారు. ఈ వేలంలో పాల్గొన్నవారంతా టీఆర్ఎస్ పార్టీ అనుకూల కంపెనీలేనని అన్నారు.రేవంత్ రెడ్డి ఆరోపణల్లో నిజం ఎంత అన్నది పక్కన పెడితే… ఇలా రోజూ ఏదో ఒక విధమైన ప్రకటనలు చేయడం ద్వారా… కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పునరుత్తేజం తెస్తున్నారు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండేళ్లకు పైగా సమయం ఉంది కాబట్టి… ఈలోగా పార్టీని బలోపేతం చేసుకుంటే… పూర్వవైభవం వస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు.