KCR

 

రైతుల రుణమాఫీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..

 

పటాన్‌ చెరులో కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరంగల్‌, చెస్ట్‌ ఆసుపత్రి ప్రాంగణం, టిమ్స్‌లో, గడ్డిఅన్నారం మార్కెట్‌, ఆల్వాల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులతో పాటు ఆర్థికంగా వెనకబడిన వారికి శుభవార్త చెప్పింది. ముఖ్యంగా కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై కేటినెట్ చర్చించింది. కేసులు ఎక్కువగా జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని, ఔషధాలు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది.

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే:

కరోనా కారణంగా ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. అలా అనాథలైన పిల్లల పూర్తి వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్‌ ఆదేశించింది. అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధానం రూపకల్పన కోసం మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డిని నియమించారు. కొత్తగా మంజూరైన ఏడు వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరమే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వైద్య కళాశాలలకు భవనాలు, హాస్టళ్లు, మౌలికవసతుల కల్పించే అంశంపైనా సమావేశంలో చర్చించారు. పటాన్‌ చెరులో కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరంగల్‌, చెస్ట్‌ ఆసుపత్రి ప్రాంగణం, టిమ్స్‌లో, గడ్డిఅన్నారం మార్కెట్‌, ఆల్వాల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను ఇక నుంచి ‘‘ తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ’’ (టీమ్స్) గా నామకరణం చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్క చోటనే అందించే ‘ సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని కేబినెట్ ఆదేశించింది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది రూ.50వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి ఈనెలాఖరులోపు రూ.50వేల రుణమాఫీని పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో రూ.50వేల లోపు రుణం తీసుకున్న 6లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపైనా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్)కు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఇస్తామని తెలిపింది.వానాకాలం పంటల సాగుపైనా కేబినెట్‌లో చర్చించారు. వర్షాలు, పంటలు, సాగునీరు, ఎరువుల లభ్యత గురించి చర్చ జరిగింది. తెలంగాణలో పత్తికి బాగా డిమాండ్ ఉందని.. ఈ నేపథ్యంలో పత్తి సాగును పెంచేలా రైతును ప్రోత్సహించాని నిర్ణయించారు.