రైతు బాగుంటేనే మనం బాగుంటాం – సీఎం జగన్

🔹రూ.1,820 కోట్ల పంట ఉచిత బీమా
🔹23 నెలల్లో 83,000 కోట్లు
🔹రైతాంగానికి అండగా రైతు భరోసా కేంద్రాలు

అమరావతి (ప్రశ్న న్యూస్) వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకం మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి బదలాయించారు. ఈ పథకం కింద అర్హులుగా గుర్తించిన 15.15 లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ది పొందుతారు. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి.. ఈ మొత్తాన్ని విడుదల చేశారు. రైతులపై భారం పడకుండా పంట బీమా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఇందులో భాగంగా 15 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం కలిగించేలా ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు.తాము అధికారంలోకి వచ్చిన ఈ 83 నెలల కాలంలో రైతుల కోసం రూ.83,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని జగన్ చెప్పారు. ఈ నెలలోనే రైతుల కోసం వైఎస్సార్ రైతు భరోసా మొత్తాన్ని చెల్లించామని, ఇదే నెలలోనే పంట బీమా పథకం కింద నిధులను మంజూరు చేయగలిగామని చెప్పారు. రాష్ట్రంలో 62 శాతం మందికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, రైతులు, రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుందనే విషయాన్ని తాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాల వల్ల పంట చేతికి అందక రైతులు నష్టపోయారని, వారందరికీ మేలు చేయడానికి ఉచిత పంటల బీమా పరిహారాన్ని విడుదల చేశామని అన్నారు.

గత ప్రభుత్వం విడుదల చేయని బీమా బకాయిలు 71,500 కోట్ల రూపాయలను కూడా చెల్లించామని వైఎస్ జగన్ అన్నారు. రెండేళ్లలో రైతు భరోసా పథకం ద్వారా 17,030 కోట్ల రూపాయలను అందజేశామని, వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. దీనికోసం 17,430 కోట్ల రూపాయలను రెండేళ్లలో ఖర్చు చేశామని పేర్కొన్నారు. నాణ్యమైన కరెంట్‌ ఇవ్వడానికి, లో ఓల్టేజీ సమస్య లేకుండా చేయడానికి 1,700 కోట్లతో వ్యవసాయ ఫీడర్లను అప్‌గ్రేడ్ చేశామని వివరించారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద అందించిన సొమ్ము 1,030 కోట్లను విడుదల చేశామని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెండు వేల జనాభా ఉన్న ప్రతి గ్రామానికీ ఓ సచివాలయం ఏర్పాటు చేశామని, వాటికి అదనంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడ్డామని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నేరుగా రైతు వద్దకే ఆర్బీకేల ద్వారా అందుతున్నాయని జగన్ వివరించారు. ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని.. రైతులకు మంచి జరగాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని ప్రారంభించామని, వచ్చే నాలుగేళ్ల్లో 4,932 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపుగా రెండు లక్షల బోర్లు వేయిస్తామని ,సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా మోటర్లను అందజేస్తున్నామని వైఎస్ జగన్ తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే..ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉద్దేశించిన పరిహారాన్ని ఏడు లక్షల రూపాయలకు పెంచామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పట్టించుకోలేదని, వాళ్లకు కూడా తమ ప్రభుత్వమే పరిహారం చెల్లించదని అన్నారు. ప్రతి జిల్లాలో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు అందజేస్తున్నామని జగన్ వివరించారు.