వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్
🔹రెండు రోజుల్లో జిల్లాల పేర్ల మార్పుకు సంబంధించి జీవో జారీ
🔹వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
🔹త్వరలోనే మామునూరు ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి
వరంగల్ (ప్రశ్న న్యూస్) వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ప్రొఫెసర్ జయశంకర్ పదో వర్ధంతి సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజ తో పాటు , పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించటంతో పాటుగా, జిల్లాలో అత్యధికంగా అన్ని హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలో టిఆర్ఎస్ శ్రేణులు జోష్ నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ అర్బన్ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లా ల విషయంలో కీలక ప్రకటన చేశారు. ఇకనుండి వరంగల్ అర్బన్ జిల్లా పేరును హనుమకొండ జిల్లాగా మారుస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే వరంగల్ రూరల్ జిల్లా ను వరంగల్ జిల్లా గా మారుస్తామని పేర్కొన్నారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించి జిల్లాల పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే వరంగల్ లో కూడా కలెక్టరేట్ ను నిర్మిస్తామని కేసీఆర్ వెల్లడించారు. సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన కేసీఆర్ చాలా చక్కటి కలెక్టర్ కార్యాలయం పెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు. హనుమకొండ జిల్లా వరంగల్ జిల్లాల పేర్లు మార్చడం తో పాటు, రెండు జిల్లాల సరిహద్దులలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్ తో పాటు వరంగల్ అభివృద్ధిలో పోటీ పడుతుందని, వరంగల్ చాలా గొప్ప పరిశ్రమలు, విద్యా వైద్య కేంద్రం కావాలని కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరంగల్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం అన్నారు. ప్రభుత్వ ప్రతినిధి బృందం కెనడా వెళ్లి అక్కడ వైద్యాలయాలను సందర్శించి వచ్చాక మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్లాన్ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ వాళ్ళు ఈర్ష్య పడేలా హాస్పిటల్ నిర్మిస్తామని పేర్కొన్నారు కేసీఆర్. త్వరలోనే మామునూరు ఎయిర్ పోర్ట్ వస్తుందంటూ పేర్కొన్నారు. వరంగల్ లో అద్భుతమైన మెడికల్ హబ్ నిర్మిస్తామని, ఏడాదిన్నర కాలంలో అన్ని నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నానని కేసీఆర్ వెల్లడించారు. రెండు మూడు వేల కోట్లు ఖర్చు అయినా సరే నూతన మెడికల్ హబ్ నిర్మించి తీరుతామని కెసిఆర్ పేర్కొన్నారు. రెండు ఎకరాల స్థలంలో కలెక్టర్ కు అధునాతన నివాసం కట్టాలని సి ఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు కలెక్టర్ అనే పేరు కూడా మార్చాలని తన అభిప్రాయం అంటూ కేసీఆర్ వెల్లడించారు. ఎంజీఎం , కేఎంసి , రీజనల్ ఐ హాస్పిటల్, సెంట్రల్ జైలు స్థలాలు కలిపి దాదాపు రెండు వందల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని, ఆ స్థలం లోనే మెడికల్ హబ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని పేర్కొన్న సీఎం కేసీఆర్ రెండు శాతం లోపే కేసులు నమోదు అవుతున్నాయని, కరోనా మూడవ దశ వస్తే అక్టోబర్ తర్వాత వస్తుందంటూ పేర్కొన్నారు. తనకు కరోనా వస్తే రెండు మాత్రలు మాత్రమే వేసుకున్నారని కేసీఆర్ చెప్పారు. టీవీ ఛానల్ ఫంగస్ పై దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. టీవీ ఛానల్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.