krishna dam

 

వాయిదాపడ్డ కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం పరిష్కారం దిశగా నేడు జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మరో తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. సమావేశాన్ని ఈ నెల 20 తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కేఆర్ఎంబీ ఈ నిర్ణయం తీసుకుంది. త్రిసభ్య కమిటీ సమావేశ ఎజెండాలో తెలంగాణ అంశాలు,అభ్యంతరాలను చేర్చలేదని కేసీఆర్ సర్కార్ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. వర్ష కాలం సీజన్ పనులతో పాటు కొన్ని ప్రాజెక్టుల పనులతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు బిజీగా ఉన్న నేపథ్యంలో సమావేశం వాయిదా వేయాలని కేఆర్ఎంబీని కోరింది. తెలంగాణ ప్రభుత్వం కోరినట్లే కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. కృష్ణా నది జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణా నదిలో నీటి వాటాలపై ఇరు రాష్ట్రాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉండటంతో గరిష్ఠ వాటా తమకే దక్కాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు ఇది అన్యాయమైన వాదన అని… పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు ఉండవని ఏపీ వాదిస్తోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు ఇప్పటికే పరస్పరం బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. కృష్ణా నదిపై ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు అక్రమమని తెలంగాణ ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి,ఇతర ప్రాజెక్టులు అక్రమమని ఏపీ ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఫిర్యాదు మేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టును కేఆర్ఎంబీ నిపుణుల బృందం సందర్శించాలని భావించినప్పటికీ అందుకు ఏపీ ప్రభుత్వం సహకరించలేదని బోర్డు పేర్కొంది. మరోవైపు బోర్డు విశ్వసనీయతపై ఇరు రాష్ట్రాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెబుతూ కొంతమందిని తప్పించాలని ఏపీ ప్రభుత్వం గతంలో కోరగా… ఏపీ లేవనెత్తిన అంశాలను మాత్రమే ఎజెండాలో చేర్చారని తాజాగా తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.2019 ఫిబ్రవరి 14న, ఈ నెల 2న తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి రాసిన లేఖల్లోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేసిన బోర్డు… తెలంగాణ లేవనెత్తిన అంశాలను,అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే సమావేశం నిర్వహించనుంది.