KCaarr

 

వాసాలమర్రి బంగారంలా మారాలె

 

యాదాద్రి (ప్రశ్న న్యూస్) దత్తత గ్రామం యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతను కేసీఆర్ భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మొత్తం 23 రకాల వంటకాలతో వెజ్, నాన్‌వెజ్ కూరలతో గ్రామస్తులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. భోజన కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వాసాలమర్రి గ్రామ అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు అందరికీ నా నమస్కారం అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. సభకు విచ్చేసిన వారు కరతాళ ధ్వనులు చేశారు. చప్పట్లు కొట్టుడు కాదు, పనిచేయాలే అంటూ వైఖరి స్పష్టం చేశారు. సీటీ కొట్టేందుకు తనేమైనా సినిమా యాక్టర్నా? సీటీలు, వట్టి లొల్లి బంద్ చేద్దాం అంటూ కేసీఆర్ ప్రసంగం సాగింది. రేపటినుంచి సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ నవీన్ నాయకత్వంలో అద్భుతమైన పని జరగాలె అన్నారు. భోజనం సమయంలో ఇద్దరు ఆడబిడ్డలు పక్కనే కూర్చున్నారు. భోజన సమయంలో అల్ల నేరేడు పళ్లు కూడా పెట్టారు. ఊర్లో అల్ల నేరేడు చెట్లు ఉన్నాయా అమ్మా అంటే లేవు బిడ్డా అని వారిలో పెద్దావిడ చెప్పింది. ఊరంటే ఇదా?… ఊర్లో అల్ల నేరేడు చెట్టు కూడా లేకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటివి సాధారణంగా తీసుకోకూడదు. ఏదైనా ప్రత్యేకమైన పని కచ్చితంగా జరగాలి. ఊరు సమగ్రాభివృద్ధి జరగాలి అని కేసీఆర్ అన్నారు.

ఊరికి 20 సార్లు వస్తాను. ఈ సారి ఇలాంటి సభలు జరగవు. ఏడాది తర్వాత వాసాలమర్రి… బీ వాసాలమర్రి కావాలి. బి అంటే బంగారు వాసాలమర్రి అని అర్థం. వీటన్నింటికంటే ముందు ప్రేమ భావం ఎంతో ముఖ్యం అని కేసీఆర్ అన్నారు. ఊరిలో వివాదాలు ఉండొద్దు. సమస్యలు పరిష్కరించి కేసులు పరిష్కరించాలని పోలీసు అధికారులకు కూడా చెబుతా. పొరుగింటి వాళ్ల అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అలాంటప్పుడు బంగారు వాసాలమర్రి సాకారం కాదా? అన్నారు. సీఎం అంతటివాడే మీ వాడైనప్పుడు అన్నీ మీ ఊరికి వస్తాయి. ప్రతి ఒక్కరికీ గొర్రెనో, బర్రెనో, చాక్లెట్టో, ట్రాక్టరో ఇవ్వగలను. కానీ ఇప్పుడు కావాల్సింది మీ గ్రామస్తుల్లో ఐక్యత. పట్టుబట్టి అద్భుతం చేశారని చుట్టు పక్కల గ్రామాలన్నీ మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి” అని కర్తవ్య బోధ చేశారు. ప్రసంగం సాగుతున్న సమయంలో వేదికపై ఓ మూల ఉన్న గ్రామ సర్పంచి అంజయ్య, ఎంపీటీసీ నవీన్‌ను గుర్తించిన సీఎం కేసీఆర్… వెంటనే వారికి వేదికపై తన సమీపంలో కుర్చీలు వేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి ఓ కమిటీ అవసరమని, పార్టీలకు అతీతంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు.