jagan

 

విశాఖ వైపు వైఎస్ జగన్ చూపు

 

🔹గ్రేటర్ విశాఖ బలోపేతం..
🔹కొత్త ఐఎఎస్ ఆఫీసర్లు
🔹అర్బన్ అడ్మిన్‌పై పట్టు

 

విశాఖపట్నం (ప్రశ్న న్యూస్) సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అమరావతి పరిధిలోని తాడేపల్లిలో గల తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలించడం ద్వారా అక్కడి నుంచి పరిపాలనకు శ్రీకారం చుట్టాలని వైఎస్ జగన్ భావిస్తోన్నారు. ఒక్కసారి విశాఖ నుంచి పరిపాలనను ఆరంభించిన తరువాత ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది జగన్ సర్కార్. అక్కడి అధికారులను బదిలీ చేసింది. కొత్తగా ఐఎఎస్ అధికారులను నియమించింది. ప్రత్యేకించి- పట్టణ పరిపాలనా వ్యవస్థపై గట్టిపట్టు ఉన్న కొందరు ఐఎఎస్ అధికారులను గ్రేటర్ విశాఖకు కేటాయించింది. వచ్చే వారం రోజుల వ్యవధిలో మరికొంతమందిని గ్రేటర్ విశాఖకు బదిలీ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రేటర్ విశాఖ పరిపాలనను బలోపేతం చేయడం ద్వారా అక్కడికి సచివాలయాన్ని అక్కడికి తరలించిన తరువాత ఇబ్బందులు రాకూడదనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఎఎస్ అధికారిణి గుమ్మళ్ల సృజన పనిచేస్తోన్నారు. సుదీర్ఘకాలంగా ఆమె అదే స్థానంలో ఉంటోన్నారు. ఫలితంగా- విశాఖ నగరంపై ఆమెకు గట్టిపట్టు ఏర్పడింది. దీనితో ఆమెను కొనసాగిస్తూనే.. జోనల్ కమిషనర్లుగా ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం నియమిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ విశాఖ పరిధిలో మొత్తం ఎనిమిది జోన్లు ఉన్నాయి. వాటన్నింటికీ ఐఎఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ముందడుగు కూడా వేసింది. జోనల్ 1-మధురవాడ, జోనల్ 2-అసీల్ మెట్ట, జోనల్ 3-సూర్యబాగ్, జోనల్ 4-జ్ఞానపురం, జోనల్ 5-గాజువాక, జోనల్ 6- వేపగుంట, భీమునిపట్నం, అనకాపల్లి జోన్లు ప్రస్తుతం గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్నాయి. తాజాగా బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌ కే శివప్రసాద్‌ను ప్రభుత్వం జీవీఎంసీ జోనల్ కమిషనర్లుగా బదిలీ చేసింది. ప్రస్తుతం జీవీఎంసీ అర్బన్ కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి బీ సన్యాసి నాయుడును సహకార శాఖకు పంపించింది. అదనపు కమిషనర్-1 పీ ఆశాజ్యోతిని కూడా బదిలీ చేసింది. కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు బదిలీ చేసింది. అదనపు కమిషనర్ తమీమ్ అన్సారియాకు కూడా ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఆయనను శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారిగా నియమించింది.
ప్రస్తుతం బదిలీ అయిన అధికారుల స్థానంలో ఐఎఎస్‌లను నియమించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పట్టణ పరిపాలనపై అవగాహన ఉన్న వారిని నియమించాలని భావిస్తోంది. వచ్చే వారం రోజుల వ్యవధిలో గ్రేటర్ విశాఖకు మరింత మంది కొత్త అధికారులను ప్రభుత్వం నియమిస్తుందని అంటోన్నారు. కాగా-జీవీఎంసీతో పాటు పోలీసు విభాగంలోనూ భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అదనపు ఎస్పీ, డీఎస్పీలు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేస్తారని చెబుతోన్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇవన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉండొచ్చని సమాచారం.