వృశ్చికం (Scorpion) 2022-2023
శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు
Scorpio/Vrishschika/వృశ్చికరాశి
(విశాఖ : 4 పాదము, అనూరాధ : 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ : 1,2,3,4 పాదములు)
(ఆదాయం – 14 వ్యయం – 14 రాజపూజ్యం – 03 అవమానం – 01)
ఈ రాశివారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి పంచమముమందు, సువర్ణమూర్తి సర్వసౌఖ్యములను కలుగజేయును. గురుని రాశి మార్పు ఈ రాశివారికి అత్యంత అనుకూలమవుతుంది. సృజనాత్మకమైన అంశాలతో కొత్తకోణంలో రాణిస్తారు. నూతన సంతాన విషయంలో శుభపరిణామాలుంటాయి. బంధువుల వలన సుఖము సన్మిత్ర లాభము ముఖవర్చస్సు, ఆయుర్దాయము పెంపొందుట తలచిన పనులు నెరవేరుట మొదలగునవి సంప్రాప్తించును. కొత్త ఆశలు రూపు దిద్దుకొనుటకు శుభయోగములకై నిరీక్షిస్తారు. గృహమున శుభపరంపరలు కొనసాగుతాయి.
శనైశ్చరుడు ఏప్రిల్ 29 నుండి చతుర్ధస్థానమందు కుంభరాశిలో రజితమూర్తిగా సంచరించును. శనైశ్చరుడు ఈ రాశివారికి మూడవ నాల్గవ ఇంట సంచరించడం వలన స్వస్థానప్రాప్తి, తనంతట తాను ప్రారంభించిన కార్యములన్నియు నెరవేరుట, నాల్గవ ఇంట సంచరించడం వల్ల ఆరోగ్యం క్షీణించడం అలాగే వాతముల వలన శరీర ఆరోగ్యము దెబ్బతినుట, ఆందోళన స్థాయి ఎక్కువగా ఉండడం జరుగుతుంది.
Know More Scorpio/Vrishschika/వృశ్చికరాశి
సాధుజనులతో సద్గోష్ఠ పవిత్రగ్రంథ పఠనం, ధ్యానం చేయడం మరియు ఒకే ఆలోచనలు మనస్తత్వాలు గల వ్యక్తులతో గడపటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో మీరు ముందుకు సాగుతారు. క్రమశిక్షణ, నిబద్ధతతో ఉద్యోగం చేసేచోట మరియు ఉద్యోగ విషయాల్లో విజయాలు సాధిస్తారు. ఇతర మిత్రులపట్ల మీ సానుకూల స్పందన సహకారం ఉదారస్వభావం ఉపకారస్వభావం కారణంగా మీకు గుర్తింపు వస్తుంది. అర్ధాష్టమ శని దుష్ఫలితాలను నివారించుటకు కొత్త వ్యాపారములు, నూతనంగా ప్రారంభించాలనుకుంటున్న పథకములను వాయిదా వేయుట మంచిది.
రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా షష్ఠ వ్యయస్థానములందు తామ్రమూర్తులుగా సంచరింతురు. దీని ఫలితంగా ధైర్యయుక్తమైన బుద్ధియునూ, స్వప్రజ్ఞచే కార్యసుముఖత, శత్రువులపై జయం, పెంపుడు జంతువులను పెంచడం, భూస్థిరాస్తుల వృద్ధి సంఘంలో గౌరవం పెరుగుతుంది.
విశాఖ, అనురాధా నక్షత్రముల వారు అధ్యాత్మికంగా చైతన్యవంతులై జ్ఞానసముపార్జన చేస్తారు. శుభయోగాలు సంప్రాప్తిస్తాయి. జ్యేష్ఠ వారు ధార్మిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ఉంటారు. వీరు తమ విషయములను రహస్యంగా ఉంచుకుని ఇతరుల విషయములను తెలుసుకొనుటకు శ్రద్ధ వహిస్తారు.
ఈ రాశివారికి అదృష్ట సంఖ్య – ‘9’. 1,2,3,4 తేదీల సంఖ్యలు ఆది, సోమ, మంగళ, గురు వారములు కలసిన మరింత మేలుజరుగును.
నెలవారీ ఫలితములు
ఏప్రిల్: పౌరసన్మానము, తన బుద్ధి ప్రకారము యథేచ్చగా వర్తించుట, కార్యజయము సాధించుట, స్త్రీలతో సంభాషణ యందు అనురక్తి గల్గి యుండుట, విద్యాగోష్టి కొనసాగించుట, ధైర్యముతో ముందుచూపుతో వ్యవహరింతురు.
మే: గ్రహస్థితి అనుకూలము కాదు. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకపోలేదు. వ్యాకులత పోగొట్టుకుని మనోనిబ్బరంగా యుండడం వేళనతిక్రమించి భుజించుట వలన ఉదర సంబంధ సమస్యలు వైద్యులను సంప్రదించుట, ఔషధసేవనం.
జూన్: మిశ్రమ ఫలితములు, మాసారంభమున స్వజనులతో ద్వేషము, తదుపరి ధైర్య యుక్తమైన పనులు చేసి అందరి మన్ననలు పొందుతారు. భూలాభము, గోవులను పెంచుట యందు అభిలాష, ధన లాభములు కలుగును. రక్తపోటు వంటి అనారోగ్యముల వలన ఇబ్బందులు కల్గును.
జూలై: మనస్సు కోరికలను అదుపులో ఉంచుకుని ముందుకు సాగుట చాలా అవసరం. మీపై నీలాపనిందలు పడే అవకాశం గలదు. గ్రహస్థితి అనుకూలం కాదు. వైద్యసహాయం, వైరల్ సంబంధ జ్వరములతో శరీరం సొంపు చెడుతుంది.
ఆగష్టు: గురు బలము కలదు. అన్ని దోషములు తొలగును. సర్వకార్యసిద్ధి, జీవనంలో ముందంజ, ప్రమోషన్‌తో స్థాన చలనము, శత్రుజయము, ఉన్నత శిఖరములను అధిరోహించుట, గ్రంధపఠనము, అధికార సిద్ధి కలుగును.
సెప్టెంబర్: సంతానం విషయంలో విద్యాఉద్యోగ అవకాశములు కలసి వస్తాయి. ధైర్యము పట్టుదలతో కార్యాచరణ. సరైన నిర్ణయములు తీసుకునుటకు మంచి సమయం గ్రహస్థితి అనుకూలము, వృత్తి వ్యాపారాలు అనుకూలము.
అక్టోబర్: అన్నిరకాల రుగ్మతలు తొలగును. శరీర ఆరోగ్యం బాగుంటుంది. స్వచ్చమైన నిర్మలమైన ఆలోచనలు వస్తాయి సమస్త దోషాలు తొలగి సకలైశ్వర్యాలు కలుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు సత్ఫలితన్నిస్తాయి.
నవంబర్: తీర్ధయాత్రలు, దూర ప్రయాణాలు వస్తాయి. ప్రయాణాల వలన అలసట కనబడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో జాగ్రత్త అవసరం. దైవసంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదానం వంటి ధార్మిక విషయాల్లో శ్రద్ధ వహిస్తారు.
డిసెంబర్: కళత్ర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. స్వ బుద్ధిచే ఉపక్రమించబడిన కార్యాలు అనుకూలిస్తాయి. ధనం విషయంలో లోటు ఉండదు. ఇతరులతో సంభాషించునపుడు సంయమనం పాటించి జాగ్రత్త తీసుకుంటారు.
జనవరి 2023: విందు వినోదాలకు అధిక ధనవ్యయం చేస్తారు. పూర్వ బంధువుల రాక మిత్రులతో కలయిక పరస్పర స్నేహభావం పెరుగుతుంది. శత్రుజయం కల్గుతుంది. నూతన ప్రణాళికల ద్వారా ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు.
ఫిబ్రవరి: గృహ నిర్మాణాలు కలసి వస్తాయి. గతంలో నిలచిన పనులన్నీ సాఫీగా సాగుతాయి. పుత్రలాభం కల్గుతుంది నూతన వధూవరులకు పుత్రలాభం. కుటుంబ వృద్ధి కల్గుతుంది. పుత్రపౌత్ర ప్రవర్ధనం. గ్రహస్థితి అనుకూలం.
మార్చి: గృహ సౌఖ్యం, ఇంటి దగ్గర అన్నిపనులు చేసిపెట్టే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. పశు సంపద వృద్ధి అవుతుంది. అధికారవృద్ధి, వృత్తి ఉద్యోగాలు కలసివస్తాయి. వ్యాపార వృద్ధి అవుతుంది. శరీర ఆరోగ్యంపై దృష్టి అవసరం.
** ** **