వృషభ (Taurus) 2022-2023

వృషభ (Taurus) 2022-2023

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు

Taurus/Vrishabha/వృషభరాశి

(కృత్తిక : 2,3,4 పాదములు, రోహిణి : 1,2,3,4 పాదములు, మృగశిర : 1,2 పాదములు)

(ఆదాయం -08 వ్యయం -08 రాజపూజ్యం -06 అవమానం -06)

ఈ రాశివారికి గురుడు ఏప్రిల్‌ 13వ తేదీ నుండి లాభస్థానమందు, రజితమూర్తి సౌభాగ్యములను కలుగజేయును. ఒకే మనస్తత్వం, ఒకే లక్ష్యం కల్గి ఒకరి అభిప్రాయములను మరొకరు గౌరవించే వ్యక్తులు మీకు పరిచయమవుతారు. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తులతో మీ ప్రయాణం మొదలవుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు ప్రమోషన్లు వస్తాయి. అన్నిచోట్లా విజయం, సౌఖ్యము కల్గుట, శత్రువులు నశించుట, కీర్తివృద్ధి ధనము, మంత్రసిద్ధి కల్గును. శనైశ్చరుడు ఏప్రిల్‌ 29 నుండి దశమ స్థానమందు కుంభరాశిలో సువర్ణమూర్తిగా సంచరించును.

శనైశ్చరుని కుంభరాశి మార్పు కొంతమేరకు మంచి మార్పును సూచించును. దశమ శని ప్రభావము వలన పాపకృత్యములు చేయుట వలన పరితాపము, వైవాహిక జీవితం మరియు కుటుంబం మధ్య కూడా సమస్యలు ఉంటాయి. కృషి మొదలగు సమస్త కార్యములు చెడును సూచించుచున్ననూ, ఆనందం, దుఃఖము, లాభము నష్టము, కష్టము సుఖము ఇలా మిశ్రమ ఫలితాలనిస్తుంది. మూర్తిమంతముచే వృషభరాశివార్కి ఈ శని సంచారం శుభప్రదమైనది మరియు భవిష్యత్తు ప్రణాళికలలో విజయం చేకూరుస్తుంది. న్యాయ సంబంధమగు ఉద్యోగాలలో అధికార యోగమునిచ్చును. మీరు చేసేపనిలో అలసత్వం మరియు పోరాటం తరువాత విజయం సాధిస్తారు.

Know More Taurus/Vrishabha/వృషభరాశి

రాహుకేతువులు ఏప్రిల్‌ 12వ తేదీ నుండి వరుసగా ద్వాదశ, షష్ఠ స్థానములందు లోహమూర్తులుగా సంచరింతురు. యజ్ఞయాగాది క్రతువులు చేయుటకు సంసిద్ధత చూపుట, ధర్మాచరణ తద్వారా కీర్తి పొందెదరు. దూర ప్రాంతములలో పుత్రుల వలన సౌఖ్యము, వారి విద్యా ఉద్యోగ యోగములు గర్వపడేలా చేస్తాయి. గృహ నిర్మాణములు కలసివస్తాయి. వాహన సౌఖ్యములు కల్గుతాయి. వ్యవహార ప్రతిబంధకములు తొలగి న్యాయసంబంధ విషయాల్లో విజయం సాధిస్తారు. సంవత్సరారంభంలోనే జన్మరాశిలో రాహువు, సప్తమ రాశిలో కేతువు దోషం తొలగి శరీర ఆరోగ్యం బాగుపడుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది. చైత్రమాసం ఉత్తరార్ధం నుంచే చేసే వర్తక వ్యాపారాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభాలు మిమ్ములను వరిస్తాయి. ధనం నిల్వ చేస్తారు.

కృత్తిక నక్ష్మత్రం వారికి వ్యవహారజయం కల్గుతుంది. రోహిణి నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ వృద్ధి, మృగశిరవారికిప్రతిబంధకములు తొలగును.

కృత్తిక వారు కెంపు, రోహిణి-ముత్యము, మృగశిర-పగడము ధరించుట

శ్రీ వేంకటేశ్వరుని ఆరాధించుటచే కలిదోషములు తొలగును.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ‘6’. 3, 4, 5, 8  తేదీల సంఖ్యలు బుధ, శుక్ర, శనివారములు కలసిన యోగప్రదములు.

నెలవారీ ఫలితములు 

ఏప్రిల్‌: పూర్వపు మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. సంయమనంతో వ్యవహరించి మీపంథా సరైనదని నిరూపిస్తారు. ఆర్ధిక విషయాల్లో పురోగతి, ఆకస్మిక ధనలాభము, సర్వత్రా విజయం తలచిన పనులు పూర్తి. 

మే: ధనధాన్య బంధు మిత్ర లాభం, వాగ్వాదములు, కోపతాపములు కంటే ఇతరుల మాటకు విలువ ఇచ్చి సంయమనం సమయస్ఫూర్తితో కార్యాలను చక్క బెడతారు. గృహమున శుభకార్యశోభ ప్రయాణాలతో శారీరక శ్రమ కల్గుతుంది. 

జూన్‌: ఉద్యోగంలో ఉన్నతితో కూడిన స్థానచలనం వస్తుంది. రాకపోకల వలన శ్రమ, శరీర నిస్సత్తువ, భూగృహ స్థిరాస్తుల మార్పులు, ఉపాసన, దైవ బ్రాహ్మణ భక్తి, ఆదాయం ముందు అవసరాలకు కావల్సిన ధనము నిల్వ చేస్తారు. 

జులై: ధైర్యం, చాకచక్యం ప్రణాళికలతో వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నంలో మీ కృషి ఫలిస్తుంది. వాగ్ధాటి ప్రదర్శించి కార్యజయయం సాధిస్తారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు, నూతన ప్రణాళికలు రూపు దిద్దుతారు. ధనం ఖర్చు. 

ఆగష్టు: ఆకస్మిక ధనలాభము మిమ్ములను వరిస్తుంది. భార్యాభర్తల మధ్య మాట కలుస్తుంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారములు స్తంభన అలాగే కొనసాగుతుంది. 

సెప్టెంబర్‌: శరీర అవయవములందు ఉష్ణ సంబంధమగు తాపములు, వాతపిత్త కఫాదిదోషములకు వైద్య సహాయము గోరు పరిస్థితి ఏర్పడును. ముందుచూపుతో వ్యవహరించి కలహములను నివారిస్తారు. యత్నకార్యసిద్ధి కల్గును. 

అక్టోబర్‌: గృహమునందు సమస్త కార్యములను చక్కబెట్టే అనుచరగణము లభిస్తారు. ఏ పనీ శ్రమ లేకుండా వాటంతటవే నెరవేరును. సోమరితనము, బంధువైరమునకు అవకాశము లేకపోలేదు. ఉష్ణజ్వరము, హృదయ పరితాపము కల్గును. 

నవంబర్‌: మనస్సున ధైర్యము తన స్వశక్తితో కార్యజయము, ఉన్నత విద్యలలో సంతానం రాణిస్తారు. వారి ఇతరదేశ ప్రయాణాలకు అనుమతులు లభిస్తాయి. మీకున్ను ఇతరదేశం వెళ్ళే అవకాశం, ఉన్నత విద్యలచే వినోదము కల్గును. 

డిసెంబర్‌: తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆదాయంతో బాటు ఇంటి ఖర్చులూ పెరుగుతాయి. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. అనవసర ఖర్చులు పెరుగును. 

జనవరి 2023: సోదరుల సహాయ సహకారములు పరిపూర్ణంగా ఉంటాయి. ఎర్రటి భూములు సంఘమందు గౌరవం, దురుసుతనంగా వ్యవహరిస్తూ భూగ్భహ స్థిరాస్తులపై ఆధిపత్యం కలిగి, విలాసవంతమైన జీవనం అనుభవిస్తారు. 

ఫిబ్రవరి: ధనం నిల్వలో ఉంటారు. కార్యసిద్ధి, సంతోషము, అధికార వృద్ధి, గృహోపకరణ వస్తువులు కొనుగోలు జేయడం, దూరపు ప్రాంతాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వినడం, వ్యవసాయ వృత్తి కలసి వస్తుంది. 

మార్చి: ఆధ్యాత్మికత పెరుగుతుంది. సహనంతో, ఉదారంగా మరియు నైతికంగా ఉంటారు. మంచి విషయాల పట్ల అవగాహన మరియు ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు మీరు కొంచెం గర్వంగా ఉన్నట్టు అనిపించవచ్చు.

** ** **