Modi

 

వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించిన ప్రధాని మోదీ

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వాహన తుక్కు విధానం(వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ) వల్ల ఫిట్నెస్ లేని వాహనాలకు స్వస్తి పలకడంతోపాటు కాలుష్యం తగ్గడానికి దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతేగాక, ఈ విధానం ద్వారా రూ. 10వేల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చే ఆస్కారం ఉందన్నారు. గుజరాత్‌లో శుక్రవారం జరిగిన పెట్టుబడుల సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని ప్రారంభించారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ఓ గొప్ప మైలురాయి అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇది చెత్త నుంచి సంపదను సృష్టించే పథకమని అన్నారు. సరికొత్త స్టార్టప్‌లు ఈ రంగంలో వెలుస్తాయని, ముఖ్యంగా దేశంలో ఉన్న మధ్యతరగతికి ఈ పాలసీ వల్ల మేలు జరుగుతుందన్నారు ప్రధానమంత్రి. ఈ తుక్కు పాల‌సీ రూ.10 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను తీసుకురానున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా మోదీ చెప్పారు.

వెహికిల్ స్క్రాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం గుజరాత్‌లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సు విస్తృత అవకాశాలను తీసుకొస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాలుష్యాన్ని తగ్గించే పనిలో భాగంగా కాలపరిమితి నిండిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తెచ్చిన కొత్త పాలసీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని మోదీ అన్నారు. ఇకపై నిరుపయోగంగా ఉన్న వాహనాల్ని దశల వారీగా తగ్గించాలన్నారు. ఈ పని చేసేందుకు స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేయాంటూ యువతను ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ పాలసీ వల్ల దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు వీలవుతుందని తెలిపారు. తుక్కుమారిన పాత వాహనాలకు ధృవపత్రం కూడా జారీ చేస్తారని, దీంతో కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో వాహన పన్నులపై రాయితీ లభించనుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్య‌క్షంగా హాజ‌రైన కేంద్రమంత్రి నితిన్ గ‌డ్క‌రీ మాట్లాడుతూ..ఈ తుక్కు పాల‌సీ కార‌ణంగా ముడి స‌రుకుల ధ‌ర‌లు 40 శాతం వ‌ర‌కూ త‌గ్గుతాయ‌ని అన్నారు. ఆటోమొబైల్ త‌యారీలో ఇండియా ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌గా మారుతుంద‌ని తెలిపారు. దేశంలో ఎటువంటి వ్యాలిడ్ ఫిట్‌నెస్ లేని వాహనాలు దాదాపు 1 కోటి వరకు ఉన్నాయన్నారు. వాహనం వయసునుబట్టి కాకుండా, దాని ఫిట్‌నెస్ ఆధారంగా ఈ స్క్రాపింగ్ పాలసీ వర్తిస్తుందన్నారు. ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో దేశంలోని అన్ని జిల్లాల్లో టెస్టింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు గ‌డ్క‌రీ తెలిపారు.

వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అంటే ఏంటీ.?

పాత‌, కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్న త‌మ వాహ‌నాల‌ను తుక్కు కింద మార్చ‌డానికి ముందుకు వ‌చ్చే య‌జ‌మానుల‌కు ఈ కొత్త విధానం కార‌ణంగా ల‌బ్ధి క‌ల‌గ‌నుంది. ఈ విధానంలో భాగంగా 15 ఏళ్లు పైబ‌డిన‌ వాణిజ్య వాహ‌నాలు, 20 ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తిగ‌త వాహ‌నాలను తుక్కు చేయాల్సి ఉంటుంది. మొద‌ట ఈ విధానాన్ని ప్ర‌భుత్వ వాహ‌నాల‌కు అమ‌లు చేయ‌నుండ‌గా.. ఆ త‌ర్వాత భారీ వాణిజ్య వాహ‌నాలు, వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు అమ‌లు చేస్తారు. వ‌చ్చే ఏడాది(2022) ఏప్రిల్‌లోగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర ఉన్న 15 ఏళ్లు పైబ‌డిన వాహ‌నాల‌ను తుక్కుగా మార్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌ను 2024 జూన్ నుంచి తుక్కు చేయనున్నారు. కాగా,ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆర్ధిక ప్రయోజనాలతో పాటు ఉపాధి కల్పన దిశగా వెహికల్‌ స్క్రాపేజ్‌ పాలసీని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ తుక్కు విధానం కింద పాతది ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయని కేంద్ర రవాణా శాఖ ఇదివరకే ప్రకటించింది.