JGN

 

వైఎస్ఆర్ చేయూత పథకం

 

🔹లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ చేయూత పథకం కింద నిధులు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు ఈ పథకం రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయాన్ని వారి ఎకౌంట్లలో జమచేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్ధికసాయాన్ని జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని అర్హులైన మహిళలకు అందించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 సాయం అందిస్తున్నామని ఆయన అన్నారు. పేదింటి మహిళలు ఆర్ధికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.వైఎస్ఆర్ చేయూత అనే పథకం నాలుగేళ్లలో రూ.75వేల చొప్పున సాయం చేసే గొప్ప కార్యక్రమం అని.., ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులు సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఈ పథకం ద్వారా రెండేళ్లలో రూ.9వేల కోట్ల సాయం, ఆర్ధిక సాయంతో పాటు మహిళల జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్నట్లు జగన్ చెప్పారు. ఇప్పటివరకు 78వేల మంది కిరాణా షాపులు పెట్టుకోగలిగారని.., లక్షా 19వేల మహిళలు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారని, లీటర్‌ పాలకు అదనంగా రూ.15 వరకు లబ్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టామని వివరించారు. ప్రముఖ కంపెనీలు, బ్యాంకులతో లబ్ధిదారుల అనుసంధానంపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు జగన్ తెలిపారు.

రాష్ట్ర మంత్రివర్గంలోనూ మహిళలకు ప్రాధాన్యత కల్పించామన్న సీఎం జగన్… దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళలకు అత్యధికంగా నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టామన్నారు. అన్నిరంగాల్లోనూ మహిళలకు అధిక ప్రాతినిథ్యం కల్పించడంతో పాటు వారి రక్షణ కోసం దిశ, అభయం యాప్‌ తీసుకొచ్చామని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, వారి రక్షణకై దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించామని, వారికోసం ప్రత్యేకంగా 900 మొబైల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. మొదటి, రెండో విడతలో కలిపి ఇప్పటివరకు రూ.8,943 కోట్లను మహిళలకు అందజేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా అందజేసే డబ్బులను ఉపయోగించుకోవడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యాపారాలలో మహిళలకు ఎక్కువ లాభాలు దక్కేలా అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ లాంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది.