Jn

వైఎస్ఆర్ వాహనమిత్ర

 

🔹మూడుదశల్లో 759 కోట్లు
🔹84 శాతం బడుగు, బలహీన వర్గాలే
🔹మద్యం తాగి వాహనం నడపొద్దు – సీఎం జగన్

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం అమలు చేస్తోన్న వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిదులను విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులుగా గుర్తించిన 2,48,468 మంది లబ్ధిదారులకు 10 వేల రూపాయల చొప్పున నగదును ఆయన బదిలీ చేశారు. దీనికోసం 248.47 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా ఆయన నగదును బదిలీ చేశారు. తన పాదయాత్ర సందర్భంగా ఏలూరులో నిర్వహించిన సభలో తాను వాహనమిత్ర పథకం గురించి ప్రస్తావించానని, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే దాన్ని అమలు చేశానని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటి దాకా ఒక్క వాహన మిత్ర పథకం కింద 759 కోట్ల రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేశామని చెప్పారు. మూడుదశల్లో ఒక్కొక్కరికి 30 వేల రూపాయల చొప్పున సహాయం అందినట్టవుతుందని అన్నారు. ఈ పథకం కింద గత ఏడాది లబ్ధి పొందిన వారిలో అర్హులందరితో పాటు కొత్తగా మరో 42,932 మందిని గుర్తించామని అన్నారు.

ఈ పథకం కింద అర్హులుగా గుర్తించిన 2,48,468 మందిలో దాదాపు 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదలే ఉన్నారని, వారి జీవితాలు మన కళ్లెదుటే మార్చే అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని అన్నారు. దేశ చరిత్రలో కూడా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్ల గురించి ఆలోచన చేసి..వారికి మంచి చేయాలనే ప్రభుత్వం ఎక్కడా లేదని చెప్పారు. ఇలాంటి సంక్షేమ పథకాలు మనరాష్ట్రంలోనే అమలవుతున్నాయని పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా డ్రైవర్లు తమ ఆటోలు, క్యాబ్‌లకు సంబంధించిన బీమాతో పాటు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను పొందడం, మరమ్మతులు చేయించడం వంటి చర్యల కోసం ఖర్చు పెడుతున్నందున.. పరోక్షంగా అందులో ప్రయాణించే వారికి కూడా భధ్రత కల్పించినట్టయిందని వైఎస్ జగన్ అన్నారు. ఈ సొమ్ముతో డ్రైవర్లు ఇన్సూరెన్స్‌ కట్టడం, వాహనాలకు మరమ్మతుల చేయించుకోవడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశాన్ని తగ్గించగలిగామని చెప్పారు. ఇలా అన్ని అనుమతులు ఉండేలా చలాన్లు కట్టే పరిస్థితి రాకుండా ఉండటానికే వాహన మిత్ర నిధులు ఉపయోగపడతాయని అన్నారు.

గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నులు, చలానా రూపంలో 2015-16లో ట్యాక్స్‌లు, పెనాల్టీలు రెండూ కలిపితే రూ.7.39 కోట్లు, 2016-17లో రూ.9.68 కోట్లు, 2017-18లో రూ.10.19 కోట్లు, 2018-19లో రూ.7.09 కోట్లను వసూలు చేశారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత 2019-20లో కాంపౌండింగ్ ఫీజుల రూపంలో 68.44 లక్షల రూపాయలను మాత్రమే వసూలు చేశామని చెప్పారు. 2020-21లో ఈ సంఖ్య 35 లక్షలేనని అన్నారు.2.48 లక్షల మందికి సాయం అందిస్తున్నప్పటికీ ఎక్కడా ఎలాంటి అవినీతి, వివక్షకు అవకాశం లేకుండా, పారదర్శకంగా నగదు బదిలీ పూర్తయిందని అన్నారు. అర్హత ఉండి వాహన మిత్ర పథకానికి ఎంపిక కాని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అలాంటి వారి కోసం మరో నెల పాటు గడువు పొడిగిస్తున్నట్లు చెప్పారు. అర్హులు వలంటీర్ల సహకారంతో దరఖాస్తు చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే 9154294326 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అన్నారు. తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా డ్రైవర్లకు సూచించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌లను కండీషన్‌లో పెట్టుకోవాలని కోరారు. ఏ ఒక్కరూ కూడా మద్యం సేవించి వాహనం నడపొద్దని విజ్ఞప్తి చేశారు.