వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష
🔹కంటతడి పెట్టిన వైఎస్ షర్మిల
🔹ఆ తల్లిదండ్రులను ఓదారుస్తూ భావోద్వేగం
🔹వైఎస్సార్‌టీపీ పోరాటం ఆగదు
🔹ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్షలు
తాడిపర్తి (ప్రశ్న న్యూస్) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో యవతకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. ఎవరు చస్తే నాకేంటి అన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉందని విమర్శించారు. మీది గుండెనా లేక రాతి బండనా అని మండిపడ్డారు. ముక్కు నేలకు రాసి దళితుడిని ముఖ్యమంత్రిని చేసి ఎక్కడికైనా వెళ్లిపోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పుడే నిరుద్యోగుల బాధలు తీరుతాయని వ్యాఖ్యానించారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలం తాడిపర్తిలో మంగళవారం(జులై 13) షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ప్రభుత్వ శాఖల్లో దాదాపు 3లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.కేవలం 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం… కనీసం వాటికి కూడా ఇప్పటివరకూ నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసేంతవరకు తమ పోరాటం ఆగదన్నారు. నిరుద్యోగులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రతీ మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా వైఎస్సార్టీపీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు అండగా మేం నిరాహార దీక్ష చేస్తున్నాం. దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటంన్నింటిని భర్తీ చేయాలి. తెలంగాణలో నిరుద్యోగ సమస్య సమసిపోయేంతవరకు వైఎస్సార్టీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడం లేదని మనస్తాపం చెందిన కొండల్ అనే యువకుడు ఇటీవల తాడిపర్తిలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల తాడిపర్తిలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. మంగళవారం(జులై 13) షర్మిల తాడిపర్తికి చేరుకుని నేరుగా కొండల్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించారు.వారితో మాట్లాడి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆ తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురై షర్మిల కూడా కంటతడి పెట్టుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్య చేసుకున్న తమ్ముడు కొండల్ కన్నీటిగాధతో రాసిన చివరి లేఖను కేసీఆర్‌కు పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ లేఖను ప్రగతి భవన్‌లో గోడకు పెట్టుకొని రోజూ చూసుకొని సిగ్గుపడాలని కేసీఆర్‌పై మండిపడ్డారు. కొండల్ ఇంటి నుంచి తాడిపర్తి బస్టాండ్ వరకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన షర్మిల అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై దీక్ష చేపట్టారు. ఇదే కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ పాలనలో తల్లిదండ్రులు తమ బిడ్డలను బొందలగడ్డకు ఎత్తుకుపోయే దుస్థితి నెలకొందన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఉద్యోగాల సంగతి పట్టించుకోలేదన్నారు. మన తల రాత మారాలంటే మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నారు. మన బతుకులు మారాలంటే రాజన్న బిడ్డ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.