వ్యాక్సినేషనే శాశ్వత పరిష్కారం – మంత్రి కేటీఆర్

 

🔹కేంద్రం తీరు వల్లే వ్యాక్సిన్ల కొరత

 

సిరిసిల్ల (ప్రశ్న న్యూస్) కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ హైదరాబాద్‌లోనే తయారవుతున్నా దురదృష్టవశాత్తు మన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 85శాతం కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకుందన్నారు. మిగిలిన కేవలం 15శాతం వ్యాక్సిన్లను ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రులు కొనుక్కోవాలని నిబంధన పెట్టిందన్నారు. నిజానికి ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేయకపోయి ఉంటే మన ప్రజలకు టీకాలు అంది ఉండేవన్నారు. టీకాల విషయంలో రాష్ట్రాల పాత్ర లేకుండా పోయిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్‌లో శుక్రవారం(మే 28) వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. స్థానికులకు ఎవరికైనా కరోనా సోకితే… హైదరాబాద్,కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లకుండా తిప్పాపూర్‌లోనే చికిత్స పొందవచ్చునని కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. కరోనా చికిత్సకు అవసరమయ్యే అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే రెండుసార్లు చేశామన్నారు. బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్ వంటి వ్యాధులకు మెడిసిన్స్ అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్‌లోని విరించి ఆస్పత్రి ఘటనపై విచారణకు వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాస్‌ను కేటీఆర్ ఆదేశించారు. ఓ కరోనా రోగికి విరించి ఆస్పత్రి యాజమాన్యం రూ.20 లక్షల బిల్లు వేయడం.. చివరికి ఆ రోగిని కాపాడలేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యానికి మృతుని బంధువులకు మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.జ్వరంతో ఆస్పత్రిలో చేరినవాడికి స్టెరాయిడ్స్ ఇచ్చి చంపేశారని మృతుడి సోదరి ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులు,బంధువులు ఆస్పత్రి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు 16 మందిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.