వ్యాక్సిన్ల సరఫరా కేంద్రానిది కాదా.? – అరవింద్ కేజ్రీవాల్
🔹పాకిస్థాన్ దాడి చేస్తే.. రాష్ట్రాలే యుద్ధం చేయాలా?
🔹కేంద్రంపై ఢిల్లీ సీఎం తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవేళ పాకిస్థాన్ మనదేశంపై దాడికి దిగితే ఢిల్లీ సొంత ఆయుధాలతోనే పోరాటం చేయాలా? ఉత్తరప్రదేశ్ సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుగోలు చేయాలా? అని నిలదీశారు. కేంద్రం బాధ్యత ఏమీ లేదా? అని ప్రశ్నించారు.మనదేశం ప్రస్తుతం కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది. మనం టీమిండియాగా ఈ పోరాటం చేయాలి. అంతేగానీ, రాష్ట్రాలు, కేంద్రం అంటూ వేర్వేరుగా కాదు. ఈ రోజు వ్యాక్సిన్లు అందివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే రాష్ట్రాలది కాదు. కానీ ఈ విషయంలో జాప్యం జరుగుతున్న కొద్దీ.. ఎంత ప్రాణ నష్టం జరుగుతుందనేది తెలియడం లేదు అంటూ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.
‘మనం రాష్ట్రాలుగా జీవించడం లేదు. ఒక దేశంగా బతుకుతున్నాం. కేంద్రం ఎందుకు వ్యాక్సిన్లు రాష్ట్రాలకు సరఫరా చేయడం లేదు’ అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్థాన్ మనదేశంపై దాడి చేస్తే.. రాష్ట్రాలను వదిలేస్తారా? ఢిల్లీ ఆయుధాలను సమకూర్చుకోవాలా? ఉత్తరప్రదేశ్ యుద్ధ ట్యాంకులు కొనుక్కోవాలా? అని కేజ్రీవాల్ నిలదీశారు.18-44 ఏళ్ల వయస్కులకు టీకా ఇచ్చేందుకు ఢిల్లీలో కొత్తగా వ్యాక్సినేషన్ సెంటర్లు తెరవాలని భావించాం కానీ, టీకాల కొరత కారనంగా ఉన్న సెంటర్లను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశమంతా దాదాపు ఇదే పరిస్థితి ఉందని అన్నారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు రాష్ట్రాలకు నేరుగా వ్యాక్సిన్లను అందించేందుకు సిద్ధంగా లేవని, కేంద్రం ద్వారానే అందిస్తామంటున్నాయని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పలు వ్యాక్సిన్ కంపెనీలను సంప్రదించగా.. నేరుగా ఢిల్లీ రాష్ట్రానికి వ్యాక్సిన్ సరఫరా చేయలేమని చెప్పిన విషయం తెలిసిందే.కాగా, ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 1491 కరోనా కేసులు నమోదు కాగా, 3952 మంది కోలుకున్నారు. 130 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,148 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది.