sharmila

 

సంక్షేమ ఫలాలు అందరికీ, సమస్యలపై పోరుబాట: వైఎస్ షర్మిల

 

🔹ప్రజల కోసం.. వారి సమస్యలపై ఫోరాటం చేద్దామని పిలుపు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాజన్న సంక్షేమ పాలన తీసుకురావడమే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఎజెండా అని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు వైఎస్ఆర్ ప్రారంభించనవేనని చెప్పారు. సంక్షేమానికి చెరగని సంతకం వైఎస్ఆర్ అని.. దాని నుంచే పార్టీ జెండా పుట్టుకొచ్చిందని చెప్పారు. పాలపిట్ట రంగు సంక్షేమాన్ని సూచిస్తుందని వివరించారు. దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే సంతోషం కలుగుతుందని.. పార్టీ జెండాను చూస్తే రెట్టింపు సంతోషం కలగాలనే ఉద్దేశంతోనే పాలపిట్ట రంగును ప్రవేశపెట్టామని చెప్పారు. నీలి రంగు సమానత్వాన్ని సూచిస్తుందని.. సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేడ్కర్ నినాదమే పార్టీ సిద్ధాతం అని చెప్పారు. పాలనలో అందరికీ భాగస్వామ్యం, అన్ని వర్గాలకు సమన్వాయం చేయడమే నీలి రంగు ఉద్దేశం అని స్పష్టంచేశారు. గ్రామగ్రామాన వైఎస్ఆర్ జెండా ఎగరేసి సంక్షేమ పాలన మళ్లీ తిరిగి రాబోతుందని అందరికీ చెప్పాలన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన ప్రతి ఒక్క వర్గానికి చేర్చారని చెప్పారు. ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి జెండా చేరాలన్నారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5వరకు నిర్వహిస్తోన్న జెండా పండుగను ఊరూరా, గ్రామగ్రామాన నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో 35ఏండ్లు పైబడిన వారందరికీ వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పాలన తెలుసు. 35 ఏండ్లు లోపల ఉన్నవాళ్లకి వైఎస్ఆర్ ఎంత గొప్ప నాయకుడో తెలిసినా సంక్షేమ పాలన కళ్లారా చూసి ఉండరన్నారు. 35 ఏండ్లు లోపు ఉన్నవారికి వైఎస్ఆర్ సంక్షేమ పాలన ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు వైయస్ఆర్ పాలన గుర్తు చేయాలని.. వారికి అందిన సంక్షేమ ఫలాలు గుర్తు చేయాలని చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆశ్వీర్వదించండని, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. చేయి చేయి కలిపితే రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురాగలం అని చెప్పారు. పార్టీ పెట్టకముందే ప్రజల మధ్య ఉండి పోరాటం చేశామని.. ఏ ప్రతిపక్షం చేయని విధంగా నిరుద్యోగుల కోసం పోరాటం చేశామని షర్మిల అన్నారు. పోరాటం మొదలు పెట్టిన తర్వాత ప్రభుత్వానికి భయం వచ్చిందని. ప్రతిపక్షానికి సోయి వచ్చిందన్నారు. పార్టీ లేకున్నా వైఎస్ఆర్ అభిమానులంతా తన పక్కన నిలబడ్డారని గుర్తుచేశారు.

ప్రజల పక్షాన పోరాడితేనే జనం ఆదరిస్తారని చెప్పారు. ప్రజల పక్షాన మనం నిలబడితేనే వాళ్లు మన పక్షాన నిలబడుతారని చెప్పారు. ప్రజల కోసం ఉన్నామంటే వాళ్లు మన చేతిలో అధికారాన్ని పెడుతారని చెప్పారు. నియోజకవర్గాలు, గ్రామాలు, మండలాల్లోని సమస్యలను సొంత సమస్యలుగా భావించి.. ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పారు. పార్లమెంటరీ నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మనదేనని చెప్పారు. కష్టపడి పనిచేస్తే, ప్రజలు విశ్వసించి.. ఆశీర్వదిస్తే, సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారని చెప్పారు. నాయకుడు కావాలనుకున్న వారు వెనకడుగు వేయకూడదన్నారు. ప్రజల కోసం కొట్లాడాలి. ప్రజలకు మేలు చేయాలని.. వైఎస్ఆర్ మొండి ధైర్యం అని పేర్కొన్నారు. అతని పోరాట పటిమ మనకు స్ఫూర్తి కావాలని చెప్పారు. పార్టీలో పదవులు వచ్చాయని నిదానం కాకండి.. పదవులు రాలేదని నిరాశ చెందకండి. ఈ పదవులు శాశ్వతం కాదు. ముందు ముందు చాలాకాలం ఉంది. మీరు కష్టపడి పనిచేస్తే తప్పకుండా గుర్తిస్తాం అని శ్రేణులకు హితబోధ చేశారు. వైఎస్ఆర్ చనిపోయాక 12 ఏండ్ల పాటు అభిమానులు చాలా కష్టపడ్డారని చెప్పారు. జేబుల్లోంచి ఖర్చు చేశారని.. చాలా మంది శ్రమను ధారపోశారని పేర్కొన్నారు. అందుకు వైఎస్ఆర్ కుటుంబం, తన తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. చాలామందికి గుర్తింపు దక్కలేదన్నారు. గతాన్ని చూసి భవిష్యత్తు మీద ఆశ కోల్పోవడం మూర్ఖత్వం అని.. ఇప్పటి నుంచి మన కష్టం మనది మన ఫలితం మనదన్నారు. ఇప్పటి నుంచి మన పోరాటం మనదని. మన గౌరవం మనదన్నారు. మన కోసం మనం .. తెలంగాణ ప్రజల కోసం మనం పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు. తెలంగాణలో రాజన్న బిడ్డగా మాటిస్తున్నానని.. మీ పక్షాన నిలబడుతానని చెప్పారు.
ప్రజల కోసం.. వారి సమస్యలపై ఫోరాటం చేద్దామని షర్మిల కోరారు. మనం చేసే పనిని ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. అదే మన పనికి తగిన గుర్తింపు అని షర్మిల చెప్పారు. జనం బాగోగులు, సాధక బాధలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి కోసం మనం పని చేస్తే.. పోరాడితే తగిన గుర్తింపు వస్తుందని వివరించారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. బేధం చూపించొద్దు అని.. అందరూ కలిసి మెలసి పనిచేయాలని శ్రేణులకు షర్మిల నొక్కి చెప్పారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నారు. కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని.. యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని షర్మిల పైరయ్యారు. కనీసం ప్రైవేట్ కొలువు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పైకి ఒకటి చెబుతూ.. లోన మరొలా మెసలుతున్నారని విరుచుకుపడ్డారు. దీనిని ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బుద్ది చెబుతారని పేర్కొన్నారు.