సర్కారును విమర్శిస్తే రాజద్రోహం కాదు – సుప్రీం కోర్టు

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) గత కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా నమోదు చేస్తున్న రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రఖ్యాత జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వినోద్ దువాకు వ్యతిరేకంగా దాఖలైన రాజద్రోహం కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు రాజద్రోహం కాబోవంటూ మరోసారి కుండబద్దలు కొట్టింది. తాజాగా ఏపీలో రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న రెండు టీవీ ఛానళ్లలోతో పాటు వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామరాజుకూ ఇది ఊరటనిచ్చింది.దేశంలో పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమకు వ్యతిరేకంగా సమాజంలో వినిపిస్తున్న విమర్శల్ని సీరియస్‌గా తీసుకుని రాజద్రోహం కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. ఓ అధ్యయనం ప్రకారం గత ఏఢేళ్లలో దేశవ్యాప్తంగా 7 వేల రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నమోదైనవే ఉన్నాయి. తాజాగా ఇదే కోవలో ఏపీ ప్రభుత్వం కూడా తమకు వ్యతిరేకంగా రోజూ గళం విప్పుతున్న రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసులు పెట్టింది. అంతటితో ఆగకుండా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రసారం చేశారన్న కారణంతో రెండు టీవీ ఛానళ్లపైనా అవే కేసులు పెట్టింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఓ యూట్యూబ్ ఛానల్లో విమర్శలు చేసిన నేరానికి ప్రఖ్యాత జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వినోద్ దువాపై రాజద్రోహం కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు… కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 1962 నాటి కేదార్‌నాథ్‌ సింగ్ తీర్పును ప్రస్తావిస్తూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసే తీవ్ర వ్యాఖ్యల్ని దేశద్రోహంగా పరిగణించలేమంటూ జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ప్రకారం ప్రతీ జర్నలిస్టూ రాజద్రోహం అభియోగాలకు వ్యతిరేకంగా రక్షణ పొందవచ్చని పేర్కొంది. 1962లో దాఖలైన రాజద్రోహం ఆరోపణలకు సంబంధించి కేంద్రం వర్సెస్‌ కేదార్‌నాథ్‌ సింగ్‌ కేసులో సుప్రింకోర్టు ఓ కీలకమైన తీర్పు వెలువరించంది. చట్టబద్ధంగా ఎవ్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు హింసాత్మక పద్ధతుల్లో జరిగే కుట్రను మాత్రమే రాజద్రోహంగా పరిగణించవచ్చని ఈ తీర్పు పేర్కొంది. ఇప్పుడు అదే తీర్పును సుప్రీంకోర్టు మరోసారి ప్రస్తావించింది. గతంలోనూ ఎన్నార్సీ ఆందోళనల సందర్భంగా నమోదైన దేశద్రోహం కేసుల విచారణలోనూ ఇదే తీర్పును ప్రస్తావించిన సుప్రీంకోర్టు జర్నలిస్టు వినోద్‌ దువా కేసులోనూ వాటిని పునరుద్ఘాటించింది.

సుప్రీం తీర్పు రఘురామకు వర్తిస్తుందా ?

తాజాగా ఏపీ సీఐడీ ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎంపీ రఘరామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే ఈ కేసు నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో కేదార్‌నాథ్‌ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం చూసినా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసే తీవ్ర వ్యాఖ్య్లలు రాజద్రోహం కాదని సుప్రీంకోర్టు చెబుతోంది. దీంతో అటు రఘురామతో పాటు రెండు టీవీ ఛానళ్లపై నమోదైన కేసులోనూ ఇదే తీర్పు వర్తించబోతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు రెండు టీవీ ఛానళ్లపై దాఖలైన రాజద్రోహం కేసు విచారణ సందర్భంగా అసలు రాజద్రోహం కేసులపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.