KCR

 

సాగర్‌పై కేసీఆర్ వరాల జల్లు

 

*రూ.150కోట్లు ప్రకటించిన సీఎం
*కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరీ అంటూ సంచలన వ్యాఖ్యలు

 

హాలియా (ప్రశ్న న్యూస్) నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. నిజానికి ఎన్నికలు అయిపోగానే తాను నియోజకవర్గానికి రావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వీలు పడలేదన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంపై పలు వరాలు కురిపించారు. నియోజకవర్గ అభివృద్దికి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా నందికొండ,హాలియా మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్‌అండ్‌బీ రోడ్లు,పంచాయతీరాజ్ రోడ్లు,కల్వర్టుల నిర్మాణానికి రూ.120 కోట్లు ప్రకటించారు.హాలియా పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సాగర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ,మినీ స్టేడియం మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్‌తో పాటు ఇరిగేషన్ భూముల్లో నివాసం ఉంటున్నవారి ఇళ్లను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తామన్నారు. ఈ మేరకు వారికి హక్కు పత్రాలు అందజేస్తామని చెప్పారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. సాగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బంజారాలు ఉన్నారని… వారి కోసం బంజారా భవనం నిర్మిస్తామని చెప్పారు.

హాలియా పట్టణం గొప్పగా అభివృద్ది జరగాల్సి ఉందని.. ఇక్కడ రోడ్లు,డ్రైనేజీల వ్యవస్థ సరిగా లేదని అన్నారు. గుర్రం పోడు ప్రాంతంలో ఇరిగేషన్ లిఫ్ట్ నిర్మిస్తే… దాని ద్వారా ఐదారు గ్రామాల‌కు క‌లిపి 10 వేల ఎక‌రాల‌ వరకు సాగునీరు అందుతుందన్నారు. గుర్రంపోడు లిఫ్ట్ స‌ర్వేకు త్వరలోనే అధికారులకు ఆదేశాలిస్తామన్నారు. నల్గొండ జిల్లాకు ఇప్పటివరకూ మొత్తం 15 లిఫ్ట్‌లు మంజూరు చేశామన్నారు. వీటన్నింటినీ రాబోయే ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాల్లో పూర్తి చేస్తామన్నారు. కృష్ణా జ‌లాల విషయంలో అటు కేంద్రం అవలంభిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరి.. ఇటు ఏపీ ప్రభుత్వ దాదాగిరీ… వీటి పట్ల మనమంతా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో రాబోయే రోజుల్లో మ‌న‌కు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉందన్నారు. కృష్ణా జలాల్లో మన వాటాతో సాగర్ ఆయకట్టులో రెండు పంటలు పండేలా చేస్తామన్నారు. పెద్ద‌దేవుల‌ప‌ల్లి-పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అనుసంధానం పూర్తయితే సాగర్ ఆయకట్టుకు ఢోకా ఉండదన్నారు.
దళిత బంధు పథకాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. రూ.1లక్ష కోట్లు ఖర్చు చేసైనా దళిత బంధు అమలుచేస్తామన్నారు. తెలంగాణ దళితులు దేశానికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 17లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని… వీరిలో 12లక్షల కుటుంబాలు దళిత బంధుకు అర్హులు అని చెప్పారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున నగదు అందజేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 100 కుటుంబాలకు పథకం అందేలా… ఆరు నూరైనా దీన్ని అమలుచేసి చూపిస్తామన్నారు. ఈ పథకాన్ని స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో 33 జిల్లా కేంద్రాల్లో మెడిక‌ల్ కాలేజీలు, ప్ర‌తి కాలేజీలో 500 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో నాలుగు సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.