Cm Sidpt

 

సిద్ధిపేటలో సీఎం కేసీఆర్

 

🔹కలెక్టరేట్,కమిషనరేట్,ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం
🔹సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు
🔹రైతు బంధు పథకంపై కేసీఆర్ ప్రసంగం

 

సిద్ధిపేట (ప్రశ్న న్యూస్) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ తాను జిల్లా పరిపాలనా అధికారి అన్న విషయం మరిచిపోయి ఓ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదివారం(జూన్ 20) సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని సీఎం స్వయంగా తీసుకెళ్లి ఆయన్ను కూర్చోబెట్టారు. కుర్చీలో కూర్చొన్న కలెక్టర్… ఆ వెంటనే సీఎం కాళ్లపై పడి నమస్కరించారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న తన కుటుంబ సభ్యులను సీఎంకు పరిచయం చేశారు. గతంలో దుబ్బాక ఉపఎన్నిక సమయంలో ఇదే కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో వినిపించిన సంగతి తెలిసిందే. టికెట్ కోసం ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లపై పడి ఆయన ఆశీర్వాదం తీసుకోవడంతో… భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే కలెక్టర్ ఇలా చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సిద్దిపేట పర్యటనలో పట్టణంపై మరోసారి వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. జిల్లాకు వెటర్నరీ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట,నిజామాబాద్,వరంగల్,నల్గొండ జిల్లాల్లో కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని… ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని అన్నారు.గతంలో మంచినీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డామని… ఈసారి మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకమునుపే మిషన్ కాకతీయకు రూపకల్పన చేశామన్నారు.మిషన్ కాకతీయ వల్ల చెరువులు నిండుగా ఉండి పంటలు పండుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని కేసీఆర్ అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. తమది రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం అని… అందుకే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. అవినీతిని అరికట్టేందుకే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. రైతులకు మంచి జరుగుతుంటే కొంతమందికి నచ్చట్లేదని… 95 శాతం రైతు బంధు సద్వినియోగం అవుతోందని స్పష్టం చేశారు.ధరణి ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయని… దీనికోసం మూడేళ్లు శ్రమించామని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ భవనంతో పాటు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ అందులో కలియతిరిగారు. మంత్రి హరీశ్ రావు కలెక్టరేట్ భవనంలోని గదులను సీఎంకు చూపిస్తూ నిర్మాణ విషయాలను వివరించారు. రూ.63 కోట్ల 60 లక్షలతో వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు వినతి పత్రాలతో రాగా సీఎం కేసీఆరే స్వయంగా వాటిని తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రూ.4 కోట్ల వ్యయంతో నాలుగెకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎమ్మెల్యే కార్యాలయం,మొదటి అంతస్తులో నివాసం ఏర్పాటు చేశారు. అభివృద్ది పనుల ప్రారంభోత్సవం అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు.