KCR

 

సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల లేఖ..

 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు లేఖ రాశారు. వెలిగొండకు అనుమతులు లేవనడం సరికాదని, ఆ ఫిర్యాదుపై పునరాలోచన చేయాలని సీఎం కేసీఆర్‌కు వారు విజ్ఞప్తి చేశారు.

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పంచాయితీ నడుస్తోంది. తాజాగా ఏపీ విపక్ష పార్టీ టీడీపీ సైతం తెలంగాణ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. వెలిగొండ ప్రాజెక్ట్‌ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు అనుమతి లేకున్నా ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు లేఖ రాశారు. వెలిగొండకు అనుమతులు లేవనడం సరికాదని, ఆ ఫిర్యాదుపై పునరాలోచన చేయాలని సీఎం కేసీఆర్‌కు వారు విజ్ఞప్తి చేశారు. కేంద్రం, కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి ఆయన్ను కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతుల్లేవని అసలు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కేంద్ర గెజిట్‌లో ప్రాజెక్టును చేర్చకపోవడం ఏపీ ప్రభుత్వ వైఫల్యమేనని.. ఇది సర్కారు వైఫల్యమే తప్ప ప్రాజెక్టుకు అనుమతులు లేనట్లు కాదని అభిప్రాయపడ్డారు. విభజన చట్టం ప్రకారం ఆరు ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించగా.. అందులో కల్వకుర్తి, నెట్టెంపాడుతో పాటు వెలిగొండ కూడా ఉందని గుర్తు చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు.
” కేంద్ర గెజిట్‌లో వెలిగొండను చేర్చండని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వహించారు. కేంద్రమే వెలిగొండకు అనుమతులిచ్చింది. కానీ ఇప్పుడు గెజిట్‌లో స్థానం కల్పించేదు. ఇది మా జిల్లా రైతుల తప్పా? ఏపీ ప్రభుత్వ తప్పిదాలను సాకుగా చూపించి వెలిగొండ ప్రాజెక్టుపై ఫిర్యాదులు చేయడం తగదు. కేంద్రం, కేఆర్‌ఎంబీకి తెలంగాణ చేసిన ఫిర్యాదు, రాసిన లేఖతో ప్రకాశం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. కరవు జిల్లాలపై కక్ష వద్దు. ఆ లేఖను వెనక్కితీసుకోండి’’ అని టీడీపీ నేతలు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా, కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన నిధుల విడుదల చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖతో పాటు కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్‌లో కేటాయింపులు లేవని, వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని లేఖలో పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టులకు అనుమతులు లేవని.. ఐనప్పటికీ ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌ వెలుపలకు నీరు తరలిస్తున్నారని వాపోయారు. ఈ అంశంపై గతంలోనే ఫిర్యాదు చేశామని మురళీధర్ గుర్తు చేశారు. అసలు అనుమతి లేని ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఎలా ఇస్తారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఏఐబీపీ కింద వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే అర్హత ఉందో లేదో పునః పరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మురళీధర్. ఐతే ఈ లేఖపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.