CJI Ramana

 

సీజే రమణ సంచలన కామెంట్స్

 

🔹జడ్జి హత్యపై సుప్రీంకోర్టు సీరియస్
🔹సీబీఐ, ఐబీ సహాయనిరాకరణ
🔹ప్రతికూల తీర్పిస్తే టార్గెట్

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ఎప్పుడూ కూల్ గా కనిపించే సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ మాత్రం ఓ కేసులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు న్యాయవ్యవస్ధ అందరికీ టార్గెట్ గా మారుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సీబీఐతో పాటు దర్యాప్తు సంస్ధలూ తమ మాట వినడం లేదని ఆక్షేపించారు. జార్ఖండ్ లోని ధన్ బాద్ కోర్టు న్యాయమూర్తి హత్య కేసును సుమోటోగా దర్యాప్తుకు స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జార్ఖండ్ లోని ధన్ బాద్ కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ అనుమాస్పద స్ధితిలో మృతి చెందిన ఘటనను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో సీబీఐతో పాటు ఇతర దర్యాప్తువిభాగాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. సుమోటోగా ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఇవాళ ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ధన్ బాద్ న్యాయమూర్తి మృతి కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీరమణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. న్యాయవ్యవస్ధ దుస్ధితికి అద్దం పట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా పలువురు న్యాయమూర్తులు ప్రతికూల తీర్పులు ఇస్తున్న సందర్భాల్లో కొందరికి లక్ష్యంగా మారుతున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తాజాగా జార్ఖండ్ లోని ధన్ బాద్ కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్.. మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతికూల తీర్పులు ఇచ్చిన కారణంగానే ఆయన టార్గెట్ అయ్యారనే అర్ధం వచ్చేలా సీజే ఎన్వీ రమణ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్ధను ప్రతికూల తీర్పుల సందర్భాల్లో టార్గెట్ చేస్తే కొత్త ట్రెండ్ సాగుతోందని రమణ తెలిపారు. దేశంలో చాలా సందర్భాల్లో పలు కేసుల్లో న్యాయమూర్తులు మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని, గ్యాంగ్ స్టర్లు, హై ప్రొఫెల్ నేరగాళ్ల కేసుల విచారణ సందర్భంగా బెదిరింపులకు గురవుతున్నారని సీజే ఎన్వీ రమణ తెలిపారు. కానీ ఇలాంటి వ్యవహారాల్లో సీబీఐ, ఐబీ, పోలీసులు కూడా న్యాయవ్యవస్ధకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీబీఐ నుంచి న్యాయవ్యవస్ధకు ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. పలు కేసుల్లో న్యాయమూర్తులు పోలీసులకు కానీ, సీబీఐకి కానీ ఫిర్యాదు చేస్తే వారి నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని ఎన్వీ రమణ ఆక్షేపించారు. పూర్తి బాధ్యతతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
ధన్ బాద్ కోర్టు న్యాయముూర్తిని ఆటోతో తొక్కించి చంపిన ఘటనను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐతో పాటు జార్ఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన జార్ఖండ్ సర్కార్… సీబీఐని రంగంలోకి దించింది. దీంతో సీబీఐ హత్య జరిగిన చోటుకు వెళ్లి ఆధారాలు సేకరిస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తోంది. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని సీబీఐ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ దర్యాప్తును తామే నేరుగా పర్యవేక్షించాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు సుమోటో విచారణ ప్రారంభించింది. దీంతో నిందితులతో పాటు సీబీఐ, జార్ఖండ్ ప్రభుత్వానికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి.