School

 

సెప్టెంబర్ 1 నుంచి కేజీ 2 పీజీ విద్యాసంస్థలు రీ-ఓపెన్..

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) విద్యాసంస్థల ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో జరిపిన సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు తెరవవచ్చని ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. దేశంలో సెకండ్ వేవ్ దాదాపుగా ముగియడంతో.. అన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలు తెరవడంపై దృష్టిపెట్టాయి. నిపుణులు సైతం ఇంకా ఎక్కువ రోజులు పిల్లలు, విద్యార్థులను ఇంటికే పరిమితం చేయడం సరికాదని సూచిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తెరిచాయి. ఏపీలోనూ ఈ నెల 16 నుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా ? అని అంతా ఎదురుచూశారు. అయితే సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఇంటర్‌లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ , ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఐదేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్‌ పొందాలంటే ఇంటర్‌‌లో పాస్ అయితే చాలు అని పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వార్షిక పరీక్షలు జరగకపోవడం, విద్యార్థులకు పాస్‌ మార్కులు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.