Rahul

 

సైకిల్ పై పార్లమెంట్ కు రాహుల్, విపక్ష ఎంపీలు

 

🔹పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుకు నిరసనగా..
🔹రాహుల్ తో పాటు సైకిల్ ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
🔹ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో రాహుల్ గాంధీ అల్పాహార విందు
🔹పెగాసస్ నిఘాపై అట్టుడుకుతున్న పార్లమెంట్

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అధికార బిజెపిని ప్రతిపక్ష పార్టీలు ఇరకాటంలో పెడుతున్నాయా ? పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై పార్లమెంట్ వేదికగా కొనసాగుతున్న రచ్చ ఉభయసభల్లోనూ ప్రతిష్టంభనకు కారణం అవుతుందా? దేశంలో అనేక సమస్యల పైన పార్లమెంట్ వేదికగా నిలదీస్తున్న ప్రతిపక్ష పార్టీలు అధికార బీజేపీకి ఊపిరాడనివ్వడం లేదా ? నిత్యం ఏదో ఒక నిరసన కార్యక్రమంతో కేంద్రాన్ని ఇబ్బంది పెడుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈరోజు పార్లమెంటుకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోని కాన్సిటిట్యూషన్ క్లబ్‌ నుండి సైకిళ్ళపై ర్యాలీగా పార్లమెంట్ కు వెళ్ళారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాహనాలపై బయటకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏమాత్రం కట్టడి లేకుండా నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరాఘాతం శరాఘాతంగా మారడంతో కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పెట్రోల్ ,డీజిల్ ధరలను కంట్రోల్ చేయలేని కేంద్రం తీరుపై నిరసన తెలియజేస్తూ సైకిళ్లపై పార్లమెంటుకు ర్యాలీగా వెళ్లారు.

రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష ఎంపీలు సైకిళ్లపై పార్లమెంటుకు హాజరై కేంద్ర ప్రభుత్వ తీరుపై తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రాహుల్ గాంధీ తో పాటుగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకు ముందు ఢిల్లీలోని కాన్సిటిట్యూషన్ క్లబ్‌లో ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ అల్పాహార విందును నిర్వహించారు. పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపద్యంలో పెగాసస్ స్పై వేర్ నిఘా వ్యవహారం పై ప్రభుత్వంపై విరుచుకు పడటానికి ఉమ్మడి వ్యూహాన్ని రచించడానికి రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలిసి అల్పాహార విందు సమయంలో చర్చించారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో కనీసం వంద మంది ప్రతిపక్ష ఎంపీలు రాహుల్ గాంధీతో భేటీ అయిన వారిలో ఉన్నారు ఇందులో ఎన్సిపి, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన , ఆర్జేడీ, సమాజ్వాది పార్టీ, సీపీ ఎం , సీపీఐ, ఐయ ఎమ్ఎల్, ఆర్ఎస్పి, కె సిఎం, జేఎంఎం మరియు డిఎంకె లు ఉన్నాయి. ఎన్డీయేతర పార్టీలను అందరిని ఏక తాటి పైకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ అల్పాహార విందు నిర్వహించినట్లుగా భావిస్తున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి పెగాసస్ నిఘా వివాదం పార్లమెంటులో దుమారం రేపుతోంది. పెగాసస్ వివాదంపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్షాలు నిత్యం డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిరోజూ వాయిదా నోటీసులు ఇస్తున్నారు. ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభలలో ఐటి మంత్రి ఇప్పటికే సమాధానం ఇచ్చారని కేంద్రం స్పష్టం చేసింది. బిజెపి సీనియర్ నాయకుడు మరియు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడారు . పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి తన సహకారాన్ని కోరారు.జూలై 19 న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి పెగాసస్‌పై ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య, కొన్ని బిల్లుల ఆమోదం మినహా లోక్ సభ , రాజ్యసభ రెండూ ముఖ్యమైన అనేక అంశాలపై చర్చించడంలో విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఆయా సభాపక్ష నేత లతో భేటీ కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంటు బయట మాక్ పార్లమెంట్ నిర్వహించే అంశంపైన కూడా చర్చించారు.

ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కూడా ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన సాగిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకునే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రెండు రోజుల పాటు ఢిల్లీలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే కేంద్రం యొక్క మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌కు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. తాను రైతుల సందేశాన్ని పార్లమెంటుకు తీసుకువచ్చానని , ప్రభుత్వం రైతుల గొంతులను అణిచివేస్తోందని మండిపడ్డారు. పార్లమెంటులో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చర్చ కేంద్రం జరగనివ్వదని ఆయన పేర్కొన్నారు. రైతులకు నష్టం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతుల కోసం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రాహుల్ గాంధీ ఇక తాజాగా సైకిల్ ర్యాలీ నిర్వహించి పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుపై తమ నిరసన తెలియజేశారు.