KCR

 

హుజురాబాద్ ఉప ఎన్నిక పధక రచనలోనే దళిత బంధు పథకం

 

🔹ఆ సామాజిక వర్గానికి ఎర
🔹ఎన్నికల స్టంట్ లో భాగంగానే తెలంగాణ దళిత బంధు
🔹కేసీఆర్ వ్యూహం.?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వెనుక హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రధాన కారణమా? కెసిఆర్ ఈటలను డీ కొట్టే పధక రచనలో భాగంగానే తెలంగాణ దళిత బంధు పథకానికి శ్రీకారం చుడుతున్నారా ? దళిత బంధు పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ను ఎంపిక చేయడం వెనుక ఆంతర్యం అదేనా? అంటే అవును అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. తెలంగాణ సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టిఆర్ఎస్ నుండి అత్యంత అవమానకరంగా వెళ్లిపోయిన ఈటల రాజేందర్ బిజెపి తీర్థం పుచ్చుకొని హుజూరాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ను బలంగా ఢీ కొట్టడం కోసం సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇక రానున్న హుజురాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ దళిత బంధు పథక అమలుకు హుజురాబాద్ ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్నాయి అంటే ఆసక్తికర పథకాలకు, వివిధ సామాజిక వర్గాలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు తెలంగాణ దళిత బంధు పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా, హుజురాబాద్ నియోజకవర్గాన్ని నిర్ణయించడంతో హుజురాబాద్ కు అదనంగా 1500 కోట్ల రూపాయల నుండి 2000 కోట్ల వరకూ నిధుల కేటాయింపు జరగనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాల నుండి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దళిత బంధు పథకంలో భాగంగా ఒక నిరుపేద కుటుంబానికి వ్యాపారం చేసుకోవడం కోసం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని, ప్రతి నియోజకవర్గంలోనూ వంద కుటుంబాలకు సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక దళిత సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, వారి ఓటు బ్యాంకును ప్రతిపక్ష పార్టీలకు పడకుండా చేసేలా హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఈటలకు చెక్ పెట్టేందుకేనని హుజురాబాద్ నియోజకవర్గ లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈటలను ఓడించటం కోసం ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ, మంత్రులను రంగంలోకి దించి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఎంత డబ్బైనా ఖర్చు చేయడం కోసం సిద్ధమవుతున్నారు. ఇక అక్కడ మిగతా సామాజిక వర్గాలకు ఏ తాయిలాలు ప్రకటిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో హుజూరాబాద్ రాజకీయం రసకందాయంలో పడిందని అర్ధం అవుతుంది.