హుజురాబాద్ కు అమిత్ షా
🔹బండి బృందం ఢిల్లీ టూర్
🔹ఈటలకు కేంద్రం భరోసా
🔹డబ్బులు తీసుకొని గెలిపిద్దామన్న బండి
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో అధికార సాధనే ధ్యేయంగా అడుగులు వేస్తోన్న బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా, ప్రతి ఎన్నికను, ఉప ఎన్నికనూ సీరియస్ గా తీసుకుని అధికార టీఆర్ఎస్ పై పోరాడుతున్నది. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యం కావడం, బలమైన అభ్యర్థి ఈటల రాజేందర్ తమ వైపు ఉన్నా, పొరపాటుకు తావు లేకుండా పక్కాగా పావులు కదుపుతున్నది. హుజూరాబాద్ రంగంలోకి బడా నేతలను సైతం దింపేందుకు రెడీ అవుతున్నది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత మీడియా ఫోకస్ మొత్తం అటువైపే తిరగ్గా, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ప్రభ కాస్త పలుచబడినట్లుగా ప్రచారం జరిగింది. కేసీఆర్ సర్కారుపై పోరులో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. అనివార్యమైన పాదయాత్రను రేవంత్ రెడ్డి కంటే ముందుగానే ప్రకటించడం ద్వారా బండి సంజయ్ చతురత ప్రదర్శించారు. పాదయాత్ర, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్రం పెద్దల ఆశిస్సుల కోసం బండి సంజయ్ బృందం బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లింది. ఆయన వెంట ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి,జితేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్, గుజ్జుల ప్రేమేందర్ తదితర నేతలున్నారు. వీరంతా ఢిల్లీ పర్యటనలో భాగంగా బండి సంజయ్ బృందం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసారు. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుక్ వెంటరాగా, సంజయ్, ఈటల, ఇతర నేతలను అమిత్ షా ఇంటికెళ్లి సమావేశమయ్యారు. ఆగస్టు 9 నుంచి తాను తలపెట్టనున్న పాదయాత్ర వివరాలను సంజయ్.. షాకు వివరించగా, ఆయన ఆశిస్సులు అందజేసినట్లు తెలిసింది.
మరో కీలకమైన విషయం ఏంటంటే, అమిత్ షాతో భేటీలో హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి కూడా చర్చించామని, విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో నేరుగా తానూ పాల్గొంటానని అమిత్ షా హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు. దీన్ని ఈటలకు అమిత్ షా ఇచ్చిన భరోసాగా పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఏడాదిన్నర కిందట గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అమిత్ షా ప్రచారం బీజేపీకి భారీగా లాభించడం, అంతకు ముందు 4 సీట్లనుంచి కమల దళం ఏకంగా 48 స్థానాలను గెలవడం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల మాదిరిగానే హుజూరాబాద్ లోనూ అమిత్ షా పర్యటన గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. హుజూరాబాద్ లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారంలో మునిగిపోగా, అధికార టీఆర్ఎస్ అభ్యర్థి వేటలో బిజీగా ఉంది. కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతున్నా, అభ్యర్థి ఎవరనేది చివరి నిమిషంలోనే ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పారు. సీఎం కేసీఆర్ తో విభేదాల కారణంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయి, బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఇన్నాళ్లుగానీ అమిత్ షాను కలవలేకపోయారు. తొలిసారి షాను కలిసిన తర్వాత ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించాం. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారు. ఇందుకోసం ఎన్ని సార్లయినా రాష్ట్రానికి వస్తానని చెప్పారు. అధికార టీఆర్ఎస్ ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీనే” అని ఈటల అన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘ఈటల బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలవాల్సింది, కానీ అనివార్య కారణాల వల్ల ఇప్పటికిగానీ సాధ్యం కాలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు ఈటలదే అని సర్వే రిపోర్టులు వచ్చాయి. అక్కడ బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా వస్తానని చెప్పారు. ఎన్నికలకు బీజేపీ ఏనాడూ భయపడదు. అభ్యర్థి దొరక్క టీఆర్ఎస్ ఆగమైతున్నది. అధికార పార్టీ ఎంత డబ్బు ఇచ్చినా, అది ప్రజల సొమ్మే కాబట్టి తీసుకుందామని, ఓటు మాత్రం ఈటలకే వేసి గెలిపిద్దామని హుజూరాబాద్ ప్రజలను నేను కోరుతున్నాను”అని బండి సంజయ్ అన్నారు.