హుజురాబాద్ లో సక్సెస్ అయితేనే యావత్ తెలంగాణాలో దళిత బంధు
🔹దళితులతో కేసీఆర్ మాటామంతీ
🔹దళితబంధు పథకంపై ప్రగతిభవన్‌లో చర్చ
🔹దళితులు పరస్పర సహకారంతో మెలగాలన్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వెనుక హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రధాన కారణమని విమర్శలు వెల్లువగా మారినా సీఎం కేసీఆర్ దళిత బంధు విషయంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తొలి అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత బంధువులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత బంధు ఒక కార్యక్రమం కాదని, ఒక ఉద్యమం అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన దళిత బంధు అవగాహన సమావేశంలో మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళిత బంధువులతోపాటు, 15 మంది రిసోర్స్ పర్సన్లు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో దళిత బంధు సాధించే విజయం పైనే యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు అడ్డుపడుతూ ఉంటాయన్న కెసిఆర్ మనలో పరస్పర సహకారం పెరగాలని, ద్వేషాలు పోవాలని సూచించారు. గతంలో ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ పై ఒత్తిడి తెచ్చి విజయం సాధించిందని గుర్తు చేశారు కేసీఆర్. నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం సాగించినప్పుడే విజయం సాధిస్తామని పేర్కొన్న కేసీఆర్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చేసిన కృషి తో దళిత సమాజంలో వెలుగు రేఖలు వచ్చాయన్నారు. దళితులు పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని, దళితవాడలలో ఒకరిపై ఒకరు పెట్టుకున్న పరస్పర కేసులను రద్దు చేసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈ పథకాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దళితులు ఒకరిపై ఒకరు పరస్పర అనుబంధం పెంపొందించుకున్నప్పుడే విజయానికి బాటలు పడతాయి అని సూచించారు కేసీఆర్. ఒక ఉద్యమంలా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు కేసీఆర్. హుజరాబాద్ లో దళిత బంధు విజయం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.