KCR & Gellu Srinivas

 

హుజూరాబాద్‌లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్..

 

🔹అందుకే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఇచ్చారా ?

ఆర్థికంగా దళితలకు ఉపయోగపడే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మాత్రం బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కల్పించారు.

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ మరో అడుగు ముందుకేసింది. ఈటల రాజేందర్‌కు పోటీగా టీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపుతుందని అంతా ఎదురుచూశారు. మాజీమంత్రులు, సీనియర్ నేతల పేర్లను కేసీఆర్ పరిశీలించడంతో.. ఆయన ఎవరి వైపు మొగ్గుచూపుతారో ఎవరూ ఊహించలేకపోయారు. అయితే గులాబీ బాస్ ఎవరూ ఊహించిన విధంగా నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దింపాలని నిర్ణయించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు కేసీఆర్ పరిశీలనలో ఉందనే వార్తలు వచ్చినా.. కేసీఆర్ నిర్ణయాలను ఊహించలేమని భావించిన చాలామంది.. ఆయనకు అవకాశం ఉంటుందా లేదా అని అంచనా వేయలేకపోయారు. అయితే కేసీఆర్ మాత్రం గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఈటల రాజేందర్‌ను ఢీ కొట్టే అవకాశం కల్పించారు. అయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఎంపిక చేసే విషయంలో సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది. టీఆర్ఎస్‌తోపాటు తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా వ్యవహరించిన ఈటలకు పోటీగా టీడీపీ లేదా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను బరిలోకి దింపితే.. అది ఈటలకు సరికొత్త అస్త్రంగా మారుతుందని కేసీఆర్ భావించారు.అందుకే ఈటలను ఢీకొట్టేందుకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, టీఆర్ఎస్‌లో మొదటి నుంచి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ నిర్ణయంతో టీఆర్ఎస్‌లో మొదటి నుంచి ఉన్న వ్యక్తికే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చినట్టయ్యింది. ఈ విషయంలో ఈటల రాజేందర్ లేదా ఇతర నేతలు టీఆర్ఎస్‌ను విమర్శించే అవకాశం లేకుండాపోతుంది. ఇదిలా ఉంటే హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకాన్ని ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. నియోజకవర్గంలోని దళితుల ఓట్లు టీఆర్ఎస్‌కు పడేలా ప్లాన్ చేశారు. కొంతకాలంగా సీఎం కేసీఆర్ దళితబంధు గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుండటంతో… హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆయన దళితులకు ప్రాధాన్యత ఇస్తారా అనే చర్చ జరిగింది.
అయితే ఆర్థికంగా దళితలకు ఉపయోగపడే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మాత్రం బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కల్పించారు. దీంతో ఆయన హుజూరాబాద్‌లో ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగినట్టు కనిపిస్తోంది. ఈటల రాజేందర్‌ను ఢీ కొట్టేందుకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని భావించిన కేసీఆర్.. ఇందుకోసం యాదవ వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌ను ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది. మొత్తానికి టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో సీఎం కేసీఆర్ ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగారని చెప్పొచ్చు.