హుజూరాబాద్ దళితబంధు కోసం రూ. 500 కోట్లు విడుదల
లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్న హరీశ్ రావు
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఇప్పటికే తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామ దళితుల కుటుంబాల ఖాతాల్లో రూ. 10 లక్షలు జమ చేసిన కేసీఆర్ సర్కారు మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా, త్వరలో ఉపఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు ఈ మొత్తాన్ని బదిలీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళితబంధు పథకం అమలుకానుంది. త్వరలోనే ఈ నిధులను దళిత కుటుంబాల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. ఆగస్టు 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ వేదికగా ప్రారంబించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి దళితుల కోసం ఈ పథకం కింద రూ. 7.60 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. హుజురాబాద్ నియోజవకర్గంలోని హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4,346 కుటుంబాలకు, వీణవంక మండలంలోని 3,678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4,996 కుటుంబాలకు, ఇల్లందకుంట మండలంలో 2,586 కుటుంబాలకు.. ఇలా మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు పరిపూర్ణ స్థాయిలో ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
వచ్చే సంవత్సరం దళిత బంధు కింద బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయించాలని ఆర్ధిక శాఖను ఆదేశించామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. దళితులందరూ ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర పథకాలను అమలు చేసిన స్ఫూర్తితో దళిత బంధును అమలు చేసి తీరుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. సోమవారం అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ భవన నిర్మాణానికి రూ. 50 లక్షలను మంజూరు చేశామన్నారు. మరో రూ. 75 లక్షలు మంజూరు చేసి.. మొత్తంగా రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో భవనం నిర్మిస్తామని మంత్రి చెప్పారు. రెండున్నరేళ్లలో తెలంగాణలో దళితుల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు.