etala n kcr

 

హుజూరాబాద్ లో పొలిటికల్ హీట్

 

🔹కేసీఆర్ ఎత్తులు, ఈటల పైఎత్తులు
🔹నువ్వా నేనా అన్నట్టు హుజూరాబాద్ రాజకీయం
🔹మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపిన టీఆర్ఎస్
🔹ఉద్యమ నాయకులను సిద్ధం చేస్తున్న ఈటల

 

హుజూరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో పాటుగా, బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో హుజురాబాద్ లో రసవత్తర రాజకీయం చోటుచేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పోరు సాగుతున్న వేళ టిఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు పదును పెట్టింది. ఈటల రాజేందర్ కూడా ప్రతివ్యూహాలతో హుజురాబాద్ బరిలోకి దిగుతున్నారు.నువ్వా నేనా అన్నట్టు ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ వర్సెస్ టిఆర్ఎస్ కొనసాగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈటల రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఈ ఉప ఎన్నిక ఇరువురికి చావో రేవో అన్న చందంగా ఉంది. ఈటల రాజేందర్ ఉప ఎన్నికలో గెలిస్తే ఆయన బలం మరింత పుంజుకుంటుంది. ఓడితే ఈటల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది. ఈ నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , మాజీ ఎంపీ వినోద్ కుమార్ లను హుజురాబాద్ లో రంగంలోకి దింపింది. గ్రామాలు, మండలాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంతో పాటుగా ఈటల వర్గాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కెసిఆర్ ఎత్తులు మొదటి నుంచి తెలిసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో తనదైన వ్యూహరచనతో ముందుకెళుతున్నారు. ఉద్యమ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా దీనిని అభివర్ణిస్తున్న ఈటల ఉద్యమ నాయకులను రంగంలోకి దింపుతున్నారు. తనతోపాటు నియోజకవర్గంలో పలు బాధ్యతలను ఉద్యమ నేతలైన స్వామి గౌడ్, విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ లకు అప్పజెప్పనున్నట్లుగా సమాచారం. ఒకప్పుడు వీరంతా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారే కావడంతో వీరిని రంగంలోకి దింపి టీఆర్ఎస్ నేతల వ్యూహాలకు చెక్ పెట్టాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు.
స్వామి గౌడ్ మాజీ ఉద్యోగ సంఘం నేత కూడా కావడంతో ఉద్యోగుల మద్దతు కోసం స్వామి గౌడ్ ను సైతం హుజరాబాద్ నియోజకవర్గం లో యాక్టివ్ చేయాలనుకుంటున్నారు ఈటల రాజేందర్. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఈటల బీజేపీలో చేరడంతో హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఊహించని విధంగా హుజూరాబాద్ నియోజక వర్గానికి నిధులు, టిఆర్ఎస్ పార్టీ నేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. అయితే ఇదంతా గమనిస్తున్న ప్రజలు రేపు ఉప ఎన్నిక జరిగితే ఎవర్ని ఆదరిస్తారనేది వేచి చూడాలి.