2024 ఎన్నికలకు అదిరిపోయేలా మోదీ మాస్టర్ ప్లాన్ ..
త్వరలో మూడు రోజుల క్యాబినెట్ భేటీ
పక్కా రూట్ మ్యాప్
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) 2024 లో జరగనున్న ఎన్నికలలోనూ బీజేపీకి పట్టం కట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటి నుండే ప్రజాక్షేత్రంలో ఒక సరికొత్త రూట్ మ్యాప్ తో వెళ్లాలని భావిస్తున్నారు. దేశంలో అనేక అంశాలపై కేంద్రం తీరుపై ప్రజల్లో అసహనం పెరుగుతున్న సమయంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ఇప్పటినుండి వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు. 2024 ఎన్నికల టార్గెట్ గా ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చేవారం నూతన మంత్రి మండలితో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ, 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటి నుండే దృష్టిసారిస్తోంది. అందులో భాగంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్త మంత్రి మండలి ఈ వారం మూడు రోజుల సమావేశాన్ని నిర్వహించి మిగిలిన మూడు సంవత్సరాల ప్రభుత్వ కాలానికి సంబంధించిన ఎజెండాను రూపొందించనుంది. వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ,దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ కేంద్రంపై సానుకూల దృక్పధాన్ని పెంపొందించడానికి కసరత్తు చేయనుంది.
2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ళపాటు పాలన సాగించిన మోడీ అప్పట్లో పెద్దగా ఒడిదుడుకులు ఎదుర్కోలేదు. మళ్లీ 2019 ఎన్నికలలో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దఫా మాత్రం పిఎం మోడీ ప్రభుత్వం కోవిడ్ -19 మహమ్మారిని సరిగా నిర్వహించలేక పోయిందని, నూతన వ్యవసాయ చట్టాల పై రైతుల ఆందోళన శాంతింప చేయలేక పోయిందని, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో లేవని, దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలడం లేదని ఇలా రకరకాలుగా ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతూ వస్తోంది. ఇక ఈ విమర్శల నుండి తనను తాను రక్షించుకునే క్రమంలో, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని చూపించే క్రమంలో సమూలంగా మంత్రివర్గంలో మార్పులు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ, ఐ టి, ఇంధన శాఖ, ఇలా డజను మంది మంత్రులను తొలగించి డైనమిక్ గా పని చేయగలిగిన, విద్యావంతులైన యువత కు కొత్త క్యాబినెట్ లో పట్టం కట్టింది. ఇక త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, అలాగే దేశంలో మళ్లీ మరోమారు అధికారంలోకి రావడానికి చేస్తున్న కసరత్తులో భాగంగా పలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి మొట్టమొదటి ప్రధాన మంత్రివర్గంలో, కొత్త మంత్రుల బృందం వచ్చే మంగళవారం నుండి మూడు రోజుల పాటు సమావేశమై తదుపరి మూడు సంవత్సరాలకు ఒక కోర్సును రూపొందించడానికి పార్లమెంటు సమావేశాలకు అనుబంధంగా సమావేశమవుతుందని బిజెపి వర్గాలు వెల్లడించాయి. గత నెలలో అన్ని మంత్రిత్వ శాఖల పనులను సమీక్షించి లక్ష్యాలను నిర్దేశిస్తామని మోడీ చెప్పినట్లుగా సమాచారం . కొత్త మంత్రులకు వారి శాఖల గురించి, వారి నుండి ఏమి ఆశిస్తున్నారో సవివరంగా తెలియజేసి దిశానిర్దేశం చేయనున్నారు.వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత 2024 లో జాతీయ ఎన్నికలు జరగబోతున్నందున అందుకు తగ్గట్టుగా వ్యూహాలను రచించే పనిలో భాగంగా మంత్రివర్గ భేటీ ఉండనుందని తెలుస్తుంది. ఈ సంవత్సరం పశ్చిమ బెంగాల్‌లో తగినంత ఓటర్లను ఆకర్షించడంలో విఫలమైన ప్రధాని మోదీ సర్కార్ భవిష్యత్తులో బీజేపీకి ఉండే ప్రజాదరణ పై కాస్త ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఉత్తర్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో దాని నాయకత్వాన్ని పునర్ వ్యవస్థీకరించడం వరకు ఇటీవల కాలంలో పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలు అందుకు అద్దం పడుతున్నాయి.
2019 లో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రభుత్వం తన మొదటి రెండేళ్లలో కేవలం రెండు ప్రకటనల విషయంలోనే పురోగతి సాధించింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం , ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో రామాలయ నిర్మాణం, బీజేపీ సాధించిన ప్రధాన విజయాలు కాగా, మిగతా అన్ని విషయాలలోనూ బిజెపి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత సంవత్సరం నుండి కోవిడ్ -19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఇబ్బందులు మరింత పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ లేకపోవడం, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన, కరోనా సెకండ్ వేవ్ లో కేంద్రం ఫెయిల్ అయిందన్న భావన వెరసి మధ్యతరగతి ఓటర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన ఎన్డీఏ ప్రభుత్వం దిద్దుబాటుకు తగిన వ్యూహాలను రెడీ చేస్తోంది.