3 లక్షల జాబ్స్ ఎక్కడ..? – షర్మిల
ఆ కొలువులేవీ కేసీఆర్
చీమ కుట్టినట్టు అయినా లేదు
అమ్ముడుపోయిన ప్రతిపక్షాలు..
ఫైర్ అయినా షర్మిల
వరంగల్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది యువత, విద్యార్థులు అని వైఎస్ షర్మిల స్పష్టంచేశారు. కానీ వారికి ప్రత్యేక రాష్ట్రంలో నిరాశే మిగిలిందన్నారు. ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత సీఎం కేసీఆర్ చేతిలో మోసపోయారని విరుచుకుపడ్డారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించి వేల మంది బలిదానం చేసుకుంటే.. కేసీఆర్ తీరుతో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. చేతగాని వాళ్లలో పాలన అందించామని ఇవాళ యువత భావిస్తోందని తెలిపారు. నోటిఫికేషన్లు రేపో, మాపో వేస్తామని చెప్పి, ఏళ్ల తరబడి కేసీఆర్ జాప్యం చేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులకు భారం కాలేక.. పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. దున్నపోతు మీద వానపడ్డట్టు కేసీఆర్‌లో మాత్రం చలనం లేదన్నారు. యువత గురించి నాకెందుకు నా కుటుంబంలో మాత్రం అయిదు ఉద్యోగాలు ఉన్నాయి కదా అని కేసీఆర్ మురిసిపోతున్నారని ఫైరయ్యారు. కళ్ల ముందు లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కనీసం భర్తీ చేయడం లేదన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి.. మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని ఫైరయ్యారు. వైఎస్ షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లా గుండెంగి గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. కేసీఆర్‌కు ఓటు వేసింది ఉద్యోగాలు వస్తాయని కానీ.. పిల్లలను చంపుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్లా? సునీల్ నాయక్ ఐదేండ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ నాయక్ చావుకు కేసీఆర్ కారణం అన్నారు. సునీల్ నాయక్ ఆసుపత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదని చెప్పారు. సునీల్ నాయక్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి, ఆరు నెలలైనా అతీగతీ లేదన్నారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని చెప్పి మోసం చేశారని విరుచుకుపడ్డారు. ఆత్మహత్య చేసుకుంటేనే ఇంటికో ఉద్యోగం ఇస్తామనే తీరుతో కేసీఆర్ వ్యవహరిస్తుని మండిపడ్డారు. ఈ లెక్క కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారని.. అయిదు ఉద్యోగాలు ఉన్నాయి? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వందల మంది ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదనే కదా తెలంగాణ తెచ్చుకుందని చెప్పారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆత్మహత్యలపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే.. ఇప్పటి వరకు స్పందించలేదన్నారు కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కేసీఆర్ కదలరు. టీఎస్ పీఎస్సీ సభ్యులు, మహిళా కమిషన్‌ను కోర్టు చెప్పినందుకే నియమించారని చెప్పారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి ఫాం హౌజ్‌లోనే మత్తుగా పడుకోవచ్చుగా కేసీఆర్?.. అని షర్మిల ఫైరయ్యారు. ఉద్యోగమే చేసుకోవాలా? హమాలీ పని చేసుకోవచ్చు కదా? అని అయిదు, ఆరు చదివినోళ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు కావొచ్చు .. డిగ్రీ, పీజీలు చేసినవాళ్లు మాత్రం హమాలీ పని చేసుకోవాలా? అని షర్మిల ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో మూడు సార్లు డీఎస్సీ వేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని షర్మిల చెప్పారు. 2008లో జంబో డీఎస్సీ పేరుతో 58 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని వివరించారు. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలో 11లక్షల ఉద్యోగాలు కల్పించారని గుర్తుచేశారు. కార్పొరేషన్ల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లోన్లు అందజేసి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారని వివరించారు. పేదింటి బిడ్డలు సూటు, బూటు వేసుకుని చదువుకోవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తే.. నేడు ఆ ఫీజు రీయింబర్స్ మెంట్‌కు నిధులు కూడా మంజూరు చేయడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బంద్, బడులు బంద్, కొలువులు బంద్ అయ్యాయని చెప్పారు.
ప్రతిపక్షాలు అన్ని కేసీఆర్‌కు అమ్ముడుపోయాయని హాట్ కామెంట్స్ చేశారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేసే వరకూ ఏ ఒక్క నాయకుడు పోరాటం చేయలేదన్నారు. రాజన్న బిడ్డగా నిరుద్యోగుల కోసం ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటానని వివరించారు. కేసీఆర్‌కు కొమ్ములొచ్చాయా? కేసీఆర్ కంటే గొప్ప గొప్ప నాయకుల పతనాన్ని ఈ చరిత్ర చూసిందన్నారు. భయపడేవాళ్లు, బెదిరిపోయేవాళ్లం కాదు మేము అని చెప్పారు. పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసం పోరాటం చేశాం అని చెప్పారు. భయపడే దాన్ని అయితే పార్టీ పెట్టేదాన్ని కాదన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదన్నారు. దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. మనం చంపాల్సింది కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ అధికారాన్ని. కేసీఆర్‌ను వదిలిపెట్టబోమని చెప్పారు. అమరజీవులంతా మన పోరాటంలో ఇంకా బతికే ఉన్నారని వివరించారు. వాళ్ల ఆశయాల కోసం పోరాడుతాం అని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని.. కొత్త జిల్లాల వారీగా 3 లక్షల వరకూ ఖాళీలు ఉన్నాయని ప్రాథమిక అంచనా అని వివరించారు. రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని కోరారు. కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లోన్లు ఇవ్వాలని.. నిరుద్యోగులందరికీ భేషరతుగా నిరుద్యోగ భృతి అమలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.