41 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన హాకీ జట్టు
కాంస్య పతకం గెలిచిన హాకీ జట్టు..
మురిసిపోతున్న సెలెబ్రిటీలు..
దేశమంతా పండుగ వాతావరణం..
భారత హాకీలో కొత్త శకం..
ప్రతీ ఒక్కరి మదిలో నిలిచిపోయే రోజు..
టోక్యో/న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన కాంస్యపోరులో భారత్ 5-4 తేడాతో జర్మనీని చిత్తు చేసి పతకాన్ని ముద్దాడింది. ఇక చిరస్మరణీయ విజయం సాధించిన పురుషుల హాకీ జట్టుపై అభినందనల వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా మన్‌ప్రీత్ సేన పోరాటానికి కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. సోషల్ మీడియా మొత్తం చక్‌దే ఇండియా నామస్మరణం వినిపిస్తోంది. ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ కదిలించినా ఈ హాకీ విజయం ముచ్చటే కనబడుతుంది. ఎవరీ స్టేటస్ చూసిన జయహో భారత్ అనే నినాదమే వినిపిస్తోంది. రాష్ట్రపతి నుంచి సామన్య పౌరుడి వరకు భారత హాకీటీమ్ సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. దాంతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన విజయం భారత హాకీలో కొత్త శకానికి నాంది పలుకుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. ‘41 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఒలింపిక్ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. ఈ జట్టు గొప్ప నైపుణ్యం, సంకల్పాన్ని ప్రదర్శించింది.ఈ విజయం భారత హాకీలో కొత్త శకానికి నాంది పలకనుంది. క్రీడల పట్ల యువతకు ప్రేరణగా నిలుస్తుంది. ‘అని పేర్కొన్నారు. ‘జర్మనీతో జరిగిన పోరులో విజయం సాధించి, కాంస్య పతకాన్ని ముద్దాడిన భారత హకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. జట్టు అద్భుత నైపుణ్యాలతో విజయాన్ని సొంతం చేసుకుంది. మీ అసాధారణ పోరాటం పట్ల ఈ దేశం గర్విస్తోంది’అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించందని, వారు సాధించిన ఈ చిరస్మరణీయ విజయంతో ఈ రోజు చరిత్రకెక్కిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘చరిత్ర సృష్టించారు. ఈ రోజు ప్రతీ భారతీయుడి మదిలో నిలిచిపోతుంది. కాంస్య పతకాన్ని సాధించిన పురుషుల హాకీ బృందానికి అభినందనలు. ఈ విజయంతో వారు ఈ దేశ ప్రజలు, మరీ ముఖ్యంగా యువత ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించారు. మీ అసాధారణ పోరాటం పట్ల ఈ దేశం గర్వపడుతోంది.’అని భారత ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మేం ఇక నిశ్శబ్దంగా ఉండలేం. ఈ రోజు భారత హాకీ జట్టు ఒలింపిక్ చరిత్రలో తమ ఆటతీరుకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. మీ పట్ల చాలా గర్వంగా ఉంది.’కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ‘41 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. భారత హాకీ, ఈ దేశ క్రీడలకు ఇదొక సువర్ణ క్షణం. జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని గెల్చుకోవడంతో సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు లభించింది. భారత్ ఇప్పుడు సంబరాలు చేసుకునే మూడ్‌లో ఉంది. మా హాకీ క్రీడాకారులకు అభినందనలు.’కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశాడు. బాలీవుడ్ హీరో షార్‌ఖాన్ సైతం మన్‌ప్రీత్ సేనను ప్రశంసించాడు. అద్భుతమైన మ్యాచ్ అని పేర్కొన్నాడు. టాలీవుడ్ ప్రముఖులు, భారత క్రికెటర్లు కూడా హాకీ ఇండియా విజయాన్ని కొనియాడుతూ ట్వీట్లు చేశారు.
మరోవైపు పురుషుల హాకీ ఆటగాళ్ల స్వస్థలాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇంపాల్‌లో హాకీ ఆటగాడు నీలకంఠ శర్మ కుటుంబం సంతోషానికి హద్దే లేకుండా పోయింది. బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులంతాచేరి నృత్యాలతో సందడి చేశారు. అటు పంజాబ్‌లో అమృత సర్‌లో కూడా పండగ వాతావరణం నెలకొంది. గుర్జంత్ సింగ్ కుటుంబ సభ్యులు డాన్స్‌లతో భారత జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒలింపిక్స్‌లో పురుషుల హాకీలో టీం కాంస్య పతకం ఖాయం కావడంతో పంజాబ్‌కు భారత హాకీ ఆటగాడు మన్ దీప్ సింగ్ కుటుంబం సంబరాలు చేసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం పతకం సాధించిందని, ఈ విజయంపై తనకు మాటలురావడం లేదంటూ మన్ దీప్ తండ్రి రవీందర్ సింగ్ ఆనందాన్ని ప్రకటించారు.