Johnson & Johnson

 

5వ టీకా గేమ్ ఛేంజర్.?

 

🔹జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకాకు అనుమతి

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. దేశంలో ఇప్పటి దాకా నాలుగు రకాల కొవిడ్ వ్యాక్సిన్లకు అనుమతి ఉండగా, అవన్నీ డబుల్ డోసు టీకాలు కాగా, తొలిసారి సింగిల్ డోసు టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ సర్కారు. అమెరికాలో తయారైన ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లతో పోల్చుకుంటే సాధారణ ఫ్రీజర్ లో సైతం నిలువ ఉంచగలిగిన ఈ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకా భారత వ్యాక్సినేషన్ ప్రక్రియలో గేమ్ ఛేంజర్ కానుందనే వాదన వినిపిస్తోంది. వివరాలలోకి వెళ్తే, కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసే దిశగా ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీలు కొన్ని సమర్థవంతమైన టీకాలను అభివృద్ధి చేశాయి. అయితే వాటిలో మెజార్టీ టీకాలు రెండు డోసులవి కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తొలిసారిగా సింగిల్ డోసు టీకాను తీసుకొచ్చింది. ఆ తర్వాతే ఆస్ట్రాజెనెకా తదితర సంస్థలూ సింగిల్ డోసు టీకాను తయారు చేశాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఆ టీకాను విరివిగా వాడుతున్నారు. ఇప్పుడదే టీకా భారత్ లో సైతం అందుబాటులోకి రానుంది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కొవిడ్ వ్యాక్సిన్ ను భారత్ లో అత్యవసరంగా వినియోగించడానికి కేంద్ర సంస్థ ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)’ శనివారం అనుమతి మంజూరు చేసింది.

జాన్సన్‌ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకాకు భారత్ లో అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని డీసీజీఐ కాకుండా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించడం గమనార్హం. భారత్‌లో ఈ టీకా తయారీకి సంబంధించి బయోలాజికల్‌-ఈ కంపెనీ భాగస్వామిగా ఉంది. ఇక్కడినుంచే పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు గవి, కొవాక్స్‌ కార్యక్రమాల ద్వారా పెద్దఎత్తున టీకా సరఫరా చేయగలమని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ లో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకా సమర్థత 85శాతంగా తేలింది. ఈ టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత ఆస్పత్రిలో చేరికలు, మరణాలు లేకుండా కాపాడుతోందని ఆ సంస్థ పేర్కొంది. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న కొద్ది గంటల్లోనే జాన్సన్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ లభించడం గమనార్హం. సింగిల్ డోసు టీకా జాన్సన్ అండ్ జాన్సన్ తోకలిపి భారత్ లో ఇప్పటి దాకా మొత్తం 5 వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చినట్లయింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి కొవిషీల్డ్, రష్యా తయారీ స్పుత్నిక్-వి వ్యాక్సిన్(భారత్ లో దీనిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తోంది), అమెరికా దిగ్గజనం మోడెర్నా వ్యాక్సిన్(ఇండియాలో దీనిని సిప్లా ఫార్మా ఉత్పత్తి చేస్తోంది)ల తర్వాత 5వ టీకాగా జాన్సన్ అండన్ జాన్సన్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ‘‘భారత్ తన టీకా పరిధిని విస్తరించింది. జాన్సన్‌ అండ్ జాన్సన్‌కు చెందిన సింగిల్‌ డోసు టీకా అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. దీంతో భారత్‌లో అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందిన టీకాల సంఖ్య ఐదుకు చేరింది. కరోనాపై మనదేశం జరుపుతోన్న పోరాటానికి ఇది తోడ్పాటునివ్వనుంది” అని ఆరోగ్య మంత్రి మాండవీయ పేర్కొన్నారు.

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌లో భారత్‌ అరుదైన మైలురాయిని చేరుకుంది. శుక్రవారం నాటికి దేశంలో పంపిణీ అయిన టీకా డోసుల సంఖ్య 50 కోట్లు దాటింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కొవిడ్‌తో భారత్‌ పోరు కీలక దశకు చేరుకుందని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి.. మన పౌరులందరికీ టీకాలు అందించగలమన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. శనివారం నాటికి దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మొదలై 204 రోజులైంది. ఇంత తక్కువ వ్యవధిలో పెద్ద మొత్తంలో టీకాల పంపిణీ రికార్డే అయినా, దేశంలో జనాభాను బట్ట చూస్తే భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నది. కేవలం రెండు వ్యాక్సిన్లే ఇప్పటికీ విరివిగా వాడుతున్నారు. పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లకు అనుమతివ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతోన్న క్రమంలోనే ఇవాళ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అనుమతి లభించింది. కాగా, అత్యవసర వినియోగానికి ఇవాళే అనుమతి పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను భారత్ లో గేమ్ ఛేంజర్ గా పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే, అమెరికా దిగ్గజ సంస్థలు తయారు చేసిన శక్తిమంతమైన వ్యాక్సిన్లలో భారత్ అవసరాలకు తగినట్లున్నది జాన్సన్ వ్యాక్సిన్ ఒక్కటే. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ అవుతోన్న వ్యాక్సిన్లలో ఫైజర్, మోడెర్నా టీకాలను అత్యంత సమర్థవంతమైన టీకాలుగా అభివర్ణిస్తున్నారు. అయితే ఆ రెండిటినీ మైనస్ 70 డిగ్రీల వద్ద స్టోర్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లో మైనస్ 70 డిగ్రీల కోల్డ్ స్టోరేజీ చైన్ అందుబాటులో లేనందున ఫైజర్, మోడెర్నాల వినియోగం ఇక్కడ కష్టతరమవుతుంది. ఆ రెండిటి తర్వాత సమర్థవంతమైనదిగా పేరు పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను మాత్రం కేవలం 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేసుకోవచ్చు. భారత్ లో ఇప్పుడు వాడుతోన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు, సెప్టెంబర్ నుంచి పంపిణీ కానున్న స్పుత్నిక్ టీకాలకు సైతం 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేసుకునేవే. భారత్ లో మూడో వేవ్ తప్పదనే సంకేతాల నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన అందరికీ సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్ డోసును ఇస్తేతప్ప ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోలేమనే హెచ్చరికలున్నాయి. సింగిల్ డోసు టీకా రాకతో ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని, సింగిల్ డోసు టీకా భారత్ లో గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, భారత్ లో ఐదవ టీకాగా అనుమతి పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకాపై అమెరికాలో భిన్నవాదనలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ సింగిల్‌ డోసు టీకా.. డెల్టా వేరియంట్‌, ఇతర వేరియంట్లపై సరిగా పనిచేయడంలేదని, అమెరికాలో మళ్లీ కరోనా విస్తరిస్తుండటమే అందుకు రుజువని న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. న్యూయార్క్ వర్సిటీ అధ్యయనంపై ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనం ప్రకారం.. అమెరికా ఆమోదించిన మూడు కరోనా వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తుల నుండి తీసుకున్న రక్త నమూనాలపై నిర్వహించిన పరీక్షల్లో జాన్సన్‌ టీకా సమర్థత 29 శాతం మాత్రమేనని తేలిందని, ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌లు అవసరమవుతాయనే సూచనలు వ్యక్తమయ్యాయని కథనంలో పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా టీకా సింగిల్‌ డెస్‌ పనితీరు 33 శాతం సమర్ధతతో పనిచేస్తుంది. రెండు డోసులకు గాను 60 శాతం సమర్ధతతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రెండో డోస్‌ కావాలని అధ్యయనం అంచనా వేసింది. ఈ టీకా తీసుకున్న వారిలో అరుదైన నాడీ స‌మ‌స్య‌లు తలెత్తే అవకాశం ఉందని, గుల్లెయిన్-బారే సిండ్రోమ్ అనే న్యూరోలాజికల్ డిజార్డర్ ప్రమాదం ఉందని అమెరికా ఆహార‌, ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ (ఎఫ్‌డీఏ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథనాలను జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కొట్టిపారేసింది. తమ టీకా అన్ని వేరియంట్లపైనా సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పింది.