KCR

 

హైదరాబాద్ ను బరాబర్ ఇస్తాంబుల్ చేస్తాం – సీఎం కేసీఆర్

 

🔹హైదరాబాద్ లో దశలవారీగా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాం
🔹కేంద్రం మెట్రో సిటీల అభివృద్ధిని పట్టించుకోవటం లేదు
🔹అవసరమైతే కేంద్రంపై పోరాటానికి సిద్ధమన్న కేసీఆర్

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతిపై జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ లాగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామనడంలో తప్పులేదని, కలలు కనడం కూడా తప్పేనా అంటూ మాట్లాడిన కేసీఆర్ బరాబర్ చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ ను డల్లాస్ చేస్తామని చెప్పలేదని రోప్ వే బ్రిడ్జ్ కావాలని మంత్రి గంగుల కమలాకర్ అడిగిన క్రమంలో కరీంనగర్ పక్కనే ఉన్న నదీ, కాలువలను అందంగా తీర్చిదిద్దుకుంటే కరీంనగర్ డల్లాస్ లా కనిపిస్తుందని చెప్పానని, అది కూడా తప్పేనా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం పై సిబిసిఐడి విచారణ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేవాదాయ భూములను, వక్ఫ్ భూములను ఫ్రీజ్ చేసి ఉంచామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని, కాంగ్రెస్ హయాంలో చేసిన తప్పులను సవరించలేక చచ్చిపోతున్నాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను రూపొందించడం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కావాలని అధికారులు చెప్పారని, దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కేసీఆర్ వెల్లడించారు.

ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెగా మెట్రో సిటీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక ఇచ్చామని పేర్కొన్న కేసీఆర్, ఈ నగరాలను బాగు చేయాల్సిన అవసరం ఉందని కానీ కేంద్రం పట్టించుకోవడం లేదని కేంద్రం తీరుపై మండిపడ్డారు. అవసరమైతే కేంద్రంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రాల అభివృద్ధికి ఎలాంటి స్పందన రావడం లేదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ పై వచ్చే ఆదాయాన్ని కూడా తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం ప్రతిపాదనను బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయని పేర్కొన్న సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ తనకు లేఖ రాశారని, కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఆ లేఖలో ప్రస్తావించారు అని పేర్కొన్నారు. అవసరమైతే కేంద్రంపై పోరాటానికి సిద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలను ఇప్పుడు బిజెపి అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.సీఎం కేసీఆర్ రాష్ట్రాల పరిధిలోని వాటిపై అధికారాలను కేంద్రం లాక్కుంటోందని, కాంగ్రెస్ హయాంలో పెట్టిన పథకాల పేర్లు బిజెపి మారుస్తోందని, తమవిగా ప్రచారం చేస్తుందని విమర్శించారు. జిఎస్టి పేరుతో రాష్ట్రాల నుండి డబ్బులు తీసుకుంటున్నా, తిరిగి కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎలాంటి నిధులు రావడం లేదని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడేళ్లలో తమ ప్రభుత్వం పట్టణ ప్రగతి, గ్రామీణ ప్రగతికి ఎంతో చేసిందని అసెంబ్లీ వేదికగా లెక్కలు చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్.