Sharmila

 

ఆట మొదలైంది

 

🔹షర్మిలకు పొలిటికల్ ట్రాప్
🔹చిక్కుతారా..కౌంటర్ చేస్తారా

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) వైఎస్ షర్మిల తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్ పైన భారీ అంచనాలతో ఉన్నారు. తన తండ్రి హయాంలో సాగిన రాజన్న పాలన తిరిగి తీసుకురావటమే తన లక్ష్యమని చెబుతున్నారు. అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఇంకా పార్టీ బలోపేతం కాకున్నా…ఇతర ప్రతిపక్షాల కంటే ధీటుగా ముఖ్యమంత్రి పైన బాణాలు సంధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే డిమాండ్ తో మూడు రోజుల దీక్ష చేసారు. రైతుల పక్షాన బలంగా వాయిస్ వినిపిస్తున్నారు. అయితే, ఎక్కడా గులాబీ పార్టీ నేతల నుండి షర్మిల విమర్శలకు మాత్రం స్పందన కనిపించటం లేదు. తాము షర్మిల విమర్శలను పట్టించుకోటం లేదనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు సమయం దగ్గర పడుతోంది. జూలై 8న షర్మిల కొత్త పార్టీ ప్రకటనతో పాటుగా..విధి విధానాలు..కార్యవర్గం ప్రకటించనున్నారు. ఆ తరువాత పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. దీంతో..ఎక్కడా షర్మిలా పేరెత్తకుండానే…ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా తగ్గటం..లాక్ డౌన్ ఎత్తివేయటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సడన్ గా జనంలోకి వచ్చారు. జిల్లాల యాత్రలు చేసారు. ఇదే సమయంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎక్కడా ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయని తెలంగాణ ప్రభుత్వం ఒక్క సారిగా అస్త్రాలను ఎక్కు పెట్టింది. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ తో పాటుగా వైఎస్సార్ ను టార్గెట్ చేసింది. దీంతో..ఒక్క సారిగా షర్మిల శిబిరంలో అంతర్మధనం మొదలైంది.

జగన్ పైన విమర్శలు చేసినా..తాను జగన్ కు వ్యతిరేకమనే ప్రచారం..తెలంగాణ ప్రజల కోసం అవసరమైతే జగన్ తోనూ ఢీ కొంటానని రాజకీయ ఎంట్రీ రోజునే షర్మిల స్పష్టం చేసారు. అయితే, తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో..వైఎస్సార్ తెలంగాణ వ్యతిరేకి..తెలంగాణకు రావాల్సిన నీరు మళ్లించారంటూ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే మాటల దాడి ప్రారంభించింది. వైఎస్సార్ పైన మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నా..షర్మిల నుండి అధికారికంగా స్పందన రాలేదు. షర్మిల పార్టీలోని ఒకరిద్దరు నేతలు మాత్రం తాము వైఎస్సార్ ను దూషిస్తే సహించబోమంటూ ప్రకటనలు ఇచ్చారు. ఇక, ఇప్పుడు షర్మిల తాజాగా చేసిన ట్వీట్లు సైతం టీఆర్ఎస్ అందుకొనే అవకాశం ఉంది. అందులో షర్మిల…కరోనా థర్డ్ వేవ్ వస్తే పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్నా.. బడులు తెరిచి పిల్లలకు బలి చేద్దామనుకుంటున్నారా అంటూ షర్మిల ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా..కార్పోరేట్ హాస్పిటల్స్ దోపిడి అయిపోయింది…స్కూలు ఫీజుల దోపిడీ కోసం తెరుస్తున్నారా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ మీ నిర్ణయాన్ని మార్చుకోండి సారూ..అంటూ ట్వీట్ చేసారు. ఇప్పుడు ఏపీలో పరీక్షల నిర్వహణ..థర్డ్ వేవ్ హెచ్చరికలు..విద్యార్ధుల ఆరోగ్యం..ప్రభుత్వ నిర్ణయం పైన రాజకీయ రగడ కొనసాగుతోంది. సుప్రీం కోర్టు సైతం ఏపీ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాణం పోతే కోటి రూపాయాలు పరిహారం ఇవ్వాలంటూ వ్యాఖ్యానించింది.
ఇక, ఇప్పుడు షర్మిల చేసిన వ్యాఖ్యల పైన ..ఏపీలో జరుగుతున్న అంశాన్ని ముడి పెట్టి తిరిగి ఎదురు దాడి చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, షర్మిల మాత్రం తన అన్న నిర్ణయాలతో సంబంధం లేదని..తాను తెలంగాణ ప్రజలకు మద్దతుగా నిలబడతానని..నిలదీస్తానని చెబుతున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీంతో..గులాబీ నేతల వ్యూహాత్మక రాజకీయ ట్రాప్ లో చిక్కుతారా..లేక కౌంటర్ ప్లాన్ తో ఎటాక్ చేస్తారా అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.