విద్యుత్ కొరత పై సీఎం జగన్ యాక్షన్ ప్లాన్..
అధికారులకు కీలక ఆదేశాలు
తాడేపల్లి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితులపై సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఇంధన శాఖకార్యదర్శి ఎన్.శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్‌సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపైనా సీఎం చర్చించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరాచేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆమేరకు తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని అధికారులు తెలిపారు. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని సీఎంకు వెల్లడించారు. రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్‌విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు.
బొగ్గు కొరత రాకూడదు..!
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్ ల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపైకూడా ఆలోచనలు చేయాలన్నారు సీఎం. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయన్న సీఎం…, ఇందుకోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
విద్యుత్ ఉత్పత్తి పెరగాలి
పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలన్నారు. 6,300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
అంతా మోసం: టీడీపీ
విద్యుత్ సంక్షోభంపై ఏపీ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వం తన అసమర్ధతతోనే దేశమంతటా విద్యుత్ కొరత ఉందంటూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. సీఎం జగన్ భార్య భారతి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ నుంచి విద్యుత్ కొనడానికే ప్రభుత్వం కృత్రిమ విద్యుత్ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ కు రూ.4,500 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి చెల్లించాలని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.12వేల కోట్ల భారం వేసిందని ఆయన అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌పై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.