ఆదివాసీలను ఆగం చేసిన కేసీఆర్: వైఎస్ షర్మిల
పోడు భూముల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం లేదు..
కేసీఆర్ పై, పాలన పై షర్మిల ఫైర్
ములుగు (ప్రశ్న న్యూస్) అడవులు ఆదివాసీల హక్కు. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టే అధికారం ఎవరికీ లేదని వైఎస్ షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనులను వాళ్ల భూముల్లోంచి ఖాళీ చేయించాలనే మొండిపట్టుతో ఉన్నారు. గిరిజనులపై దాడులు చేయిస్తూ.. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారుని విరుచుకుపడ్డారు. బుధవారం ములుగు జిల్లా లింగాల గ్రామంలో షర్మిల ‘పోడు భూములకై పోరు’ కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంతకుముందు పస్రా గ్రామంలోని కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. గిరిజనులను ఆప్యాయంగా పలకరిస్తూ, రాజన్న స్మృతులను యాది చేసుకున్నారు. పోడు భూముల కష్టాలు తెలుసుకొని, గిరిజనులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహిళలు అని కూడా చూడకుండా జైలులో పెట్టిస్తున్నారని షర్మిల ఫైరయ్యారు. తాతముత్తాల నుంచి సాగు చేసుకుంటున్నాం.. మా కడుపులు కొట్టకండి అని అడవి బిడ్డలు కాళ్లా వేళ్లా పడినా విడిచిపెట్టడం లేదన్నారు. గిరిజనుల మీద ఫారెస్ట్ ఆఫీసర్లు దాడి చేసి, మళ్లీ గిరిజనులే దాడులు చేశారని ఉల్టా కేసులు పెడుతున్నారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో పోడు భూముల కోసం కొట్లాడితే 21 మంది గిరిజనులు, పసి పిల్లల తల్లులుపై కేసులు పెట్టారు. మహిళలను మమ్మల్ని చంపడానికి ప్రయత్నించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పడానికి సిగ్గుండాలన్నారు. కేసులు పెట్టడమే కాకుండా జైలులో పెట్టి నానా రకాలుగా హింసించారని గుర్తుచేశారు. కాళ్ల మీద పడితే తప్పా అన్నం పెట్టలేదున్నారు. పాచిపోయిన అన్నం పెట్టారని ప్రశ్నిస్తే మహిళలు అని చూడకుండా లాఠీలతో కొట్టారని ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ గిరిజనులను బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇన్ని రోజులు దళితులను మోసం చేశాడు.. ఇప్పుడు గిరిజనులను మోసం చేస్తున్నాడు. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చే సరికి, దళితులతో పని ఉంది కనుక.. దళితుల చేతిలో తన జుట్టు ఉంది కనుక.. దళితులకు రూ.10లక్షలు ఇచ్చి కాళ్ల బేరానికి వచ్చారని ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చే సరికి దళితులు బంధువులయ్యారు. మరి గిరిజనులకు బంధువులు కాదా కేసీఆర్? అని షర్మిల ప్రశ్నించారు.
ఎన్నికలు వచ్చిన ప్రతీసారి పోడు భూములను పరిష్కరిస్తామని కేసీఆర్ మాట ఇచ్చారని… ఎన్నికల్లో గెలవగానే గిరిజనులను పట్టించుకోవడం లేదన్నారు. ఆవుతోలు కప్పుకున్న పులిలాగా.. పోడు సమస్యను పరిష్కరిస్తామని చెబుతూనే… మరోవైపు గిరిజనులను వెళ్లగొడుతున్నారని గుర్తుచేశారు. ఒకప్పుడు నిజాం కుమ్రం భీం ఉద్యమాన్ని గౌరవించి, ఆదివాసీలకు పోడు భూములపై హక్కులు కల్పించారని చెప్పారు. ఇవాళ కేసీఆర్ నిజాం కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. గిరిజనులపై దాడులు చేసి, భూములు లాక్కుంటున్నారని చెప్పారు. 2006 అటవీ చట్టాన్ని అప్పట్లో అద్భుతం అని పొగిడిన కేసీఆర్.. నేడు దానిని అమలు చేయడం లేదన్నారు. నాగార్జున సాగర్ బైపోల్లో జిల్లాల్లో పర్యటించి, కుర్చీ వేసుకుని పోడు సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చి మోసం చేశాడు. సీఎం కుర్చీ మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. గుర్తు పెట్టుకో కేసీఆర్.. అడవి బిడ్డల భూములు గుంజుకున్నట్లైతే.. అదే అడవి బిడ్డలను నీకు కుర్చీ లేకుండా చేస్తారని చెప్పారు. కేసీఆర్‌కు మాట మీద నిలబడడం అంటే అర్థం ఏంటో తెలియదన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు, గిరిజనులు కొట్టుకుని చస్తుంటే కేసీఆర్ ఆనందం పొందుతున్నారని.. పట్టాలు చూపినా గిరిజనులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. కేసీఆర్‌కు పోడు భూముల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం లేదన్నరు. అందుకే ధరణి పోర్టల్‌లో కాస్తు కాలమ్ అనే ఆప్షన్ తొలగించారని చెప్పారు. అది లేకుంటే అనుభవదారున్ని అని గిరిజనులు చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. పెసా చట్టం ప్రకారం.. గ్రామ సభల్లో తీర్మానం చేయకుండా ఏ పనీ చేయవద్దు. కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇష్టానుసారంగా కందకాలు, గుంతలు తొవ్వి, గిరిజనులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇంత చేస్తున్నా ఫారెస్ట్ ఆఫీసర్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదన్నారు. గిరిజనులపై దాడులు చేసిన ఆఫీసర్లకు నజరానాలు, బహుమతులు ఇస్తున్నారు. పాల్వంచలో 200 ఎకరాలు ఏండ్ల నుంచి సాగు చేసుకుంటుంటే.. 40 మంది గిరిజనులపై దౌర్జన్యం చేసి, భూములు గుంజుకున్నారు. గిరిజనులు కోర్టు చుట్టూ తిరగలేక వలస వెళ్లిపోయారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా ఆ భూముల్లో హరితహారం మొక్కలు నాటారు. వైఎస్ఆర్ మనస్ఫూర్తిగా గిరిజనులకు సేవ చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల 31వేల ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చిన ఏకైక నాయకుడు మన వైఎస్ఆర్. ప్రస్తుతం 7లక్షల మంది పోడు భూముల కోసం వేచిచూస్తున్నారు. గిరిజనులను మంత్రులు, ఎమ్మెల్యేల కాళ్లా వేళ్లా పడ్డా పట్టాలు ఇవ్వడం లేదు. ప్రశ్నించే వారు లేక కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని షర్మిల విరుచుకుపడ్డారు. ఇక నుంచి నీ ఆటలు సాగవు. రాజన్న బిడ్డ వచ్చింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చింది. ఇక నుంచి గిరిజనుల పక్షాన పోరాడుతాం. గిరిజనుల పక్షాన నిలబడుతాం. గిరిజనుల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కుట్రలను తిప్పకొడుతాం. ఇకనైనా రాష్ట్రంలోని గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చి, రైతు బంధు, రైతు బీమా ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మల తెలిపారు.