83Main3

టీకాలపై మీకొక రేటు..రాష్ట్రాలకు మరో రేటా

🔹కేంద్రంపై సుప్రీం కోర్టు ఫైర్

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జాతీయ టీకా విధానంపై దేశ అత్యున్నత న్యాయస్థానం పలు ప్రశ్నలను సంధించింది. ప్రజల ప్రాణాలను హరించి వేస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వేర్వేరు వ్యాక్సిన్ల ధరల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఒకే దేశంలో వేర్వేరు ధరలను ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. జాతీయ టీకా విధానంలో వేర్వేరు రేట్లు ఉండొచ్చా? అని ప్రశ్నించింది. వ్యాక్సిన్ల సేకరణ వ్యవహారంలో రాష్ట్రాలు అధిక రేటును ఎందుకు చెల్లించాల్సి వస్తోందని సుప్రీంకోర్టు సూటిగా మోదీ సర్కార్‌పై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది.జాతీయ టీకా విధానంపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఈ ఉదయం విచారణ చేపట్టింది. జస్టిస్ లాావు నాగేశ్వర రావు, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ రవీంద్రభట్‌లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశంపై వాదోపవాదాలను ఆరంభించింది. జాతీయ టీకా విధానం పట్ల పలు ప్రశ్నలను సంధించింది. కోవిన్ ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి వ్యాక్సిన్లను అందించాల్సి పరిస్థితిని కల్పిస్తే.. గ్రామీణుల మాటేమిటని నిలదీసింది.

జాతీయ స్థాయిలో ఒకే విధానాన్ని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం.. వ్యాక్సిన్ల సేకరణ విషయంలో రాష్ట్రాలపై అధిక భారాన్ని మోపడం సరికాదని పేర్కొంది. 45 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికి వందశాతం మేర టీకాలను సమకూర్చిన కేంద్ర ప్రభుత్వం.. 18 నుంచి 44 సంవత్సరాల్లోపు వారి కోసం అందులో సగం కూడా అందుబాటులోకి ఎందుకు తీసుకుని రాలేకపోయిందని నిలదీసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకరకంగా, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఇంకోరకంగా వ్యాక్సిన్ రేట్లను నిర్ధారించిందని, ఏ ప్రాతిపదికన ఇలా వేర్వేరుగా రేట్లను ఖరారు చేశారని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారిలో 45 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారే అధికంగా ఉన్న నేపథ్యంలో.. ఆ వయస్సు కేటగిరీ ప్రజల కోసం ఎందుకు వ్యాక్సిన్లను చాలినంతగా అందుబాటులో ఉంచుకోలేకపోయారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు ఒకే ధర ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. దాన్ని తాము గుర్తు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించింది.