revanth reddy

 

ఆ సక్సెస్ వల్లే నాకు టీపీసీసీ పదవి దక్కింది…

 

🔹రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దళిత గిరిజన దండోరాలతో ప్రభుత్వంపై రేవంత్ సమర శంఖం పూరిస్తున్నారు. అదే సమయంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. సీనియర్లందరినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ కొంపల్లిలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో చేపట్టిన రాజీవ్ రైతు దీక్ష వల్లే తనకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కిందన్నారు రేవంత్ రెడ్డి.ఆ సభ విజయవంతమైన విషయం ఢిల్లీ పెద్దలకు చేరిందన్నారు. టీపీసీసీ పదవి ఎంపికకు సంబంధించి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెప్పారు.

దళిత బంధు పథకంపై కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తోందని… దీంతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ భయంతోనే తెలంగాణ,ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో గజ్వేల్,నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందుకే కవితను నిజామాబాద్ ప్రజలు ఓడించారని గుర్తుచేశారు. కేసీఆర్‌ సైతం ఒకసారి ఎమ్మెల్యేగా,సింగిల్ విండో ఛైర్మన్‌గా ఓడిపోయారని అన్నారు. నిజామాబాద్‌లో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్రంలోని దళిత, గిరిజన కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష ముగింపు సందర్బంగా నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ ఉద్యమం చేసి ఉండొచ్చునని.. అయితే ఆయనకు కష్టానికంటే ఎక్కువ కూలీ దక్కిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొందరే బాగుపడ్డారని విమర్శించారు.

సమయమొస్తే బీసీ, మైనార్టీ, బ్రాహ్మణులకు ‘బంధు’ ఇస్తానని కేసీఆర్ చెబుతున్నారు… కానీ ఇక ఆయన టైమ్ అయిపోయింది.ఇప్పుడిక తెలంగాణ సమాజానికి టైమ్ వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్‌ను డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బహుజన భవన్‌గా మారుస్తామని ప్రకటించారు. దళిత, గిరిజన, ఆదివాసీల పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఎక్కువగా తెలంగాణ నుంచే వచ్చేలా చూస్తామన్నారు. తనకు ఎలాంటి కోరికలేవని.. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చునని… పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన వ్యక్తితో దళిత, గిరిజన, ఆదివాసీల విద్యకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టిస్తానని హామీ ఇచ్చారు.