nod

 

ఎన్నికలకు సహకరిస్తేనే రాష్ట్ర హోదా

🔹జమ్ముకశ్మీర్‌ నేతలకు తేల్చిచెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం సాగింది. సమావేశంలో పాల్గొన్న వారి అభిప్రాయాలను ప్రధాని మోదీ సావధానంగా విన్నారు. నేతలంతా నిజాయితీగా, ముక్కుసూటిగా అభిప్రాయాలను వెలిబుచ్చడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కశ్మీర్‌‌ బంగారు భవిష్యత్తుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలపరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ చర్చల్లో అందరూ భాగస్వామి కావాలని సమావేశంలో పాల్గొన్న నేతలను ప్రధాని మోదీ కోరారు. రాజకీయంగా సిద్ధాంతాలు వేరైనప్పటికీ.. వాటిని పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. డీడీసీ(డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్)కి విజయవంతంగా ఎన్నికలు నిర్వహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహిస్తామని ప్రధాని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియ త్వరితగతిన సాగుతుందని.. ఎన్నికలు కూడా వీలైనంత త్వరలో జరిగి, ప్రభుత్వం ఏర్పాటవుతుందని.. అప్పుడే జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఊతమిచ్చినట్లు అవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణపై ఎలాంటి కాలపరిమితి పెట్టలేదని ఎన్సీ నేతలు తెలిపారు. ప్రధానితో సమావేశం ఆశాజనకంగానే సాగిందన్న అభిప్రాయాన్ని జమ్మూకశ్మీర్ నేతలు వెలిబుచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనంతరం.. సమావేశంలో చర్చించిన అంశాలపై ట్వీట్స్ చేశారు.

ఇవాళ జమ్మూ మరియు కశ్మీర్‌పై జరిగిన చర్చలు స్నేహపూర్వకంగా సాగాయని.. ఈ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్షం నేతలంతా జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు వారికున్న నిబద్ధతను తేటతెల్లం చేశారని అమిత్ షా చెప్పారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. జమ్మూకశ్మీర్ భవిష్యత్ గురించి, డీలిమిటేషన్ ప్రక్రియ గురించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. 5 డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, రాష్ట్ర హోదా ఇస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ సమావేశంలో పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా చర్చల అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలమంతా జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కోరామని.. అయితే ప్రధాని, హోం మంత్రి ఎన్నికలు జరిగాక ఆ ప్రక్రియను మొదలుపెడతామని చెప్పినట్లు తెలిపారు. అయితే.. ఆజాద్ మాట్లాడుతూ.. తొలుత రాష్ట్ర హోదా కల్పించి ఆ తర్వాత ఎన్నికలను నిర్వహించాలని చెప్పారని.. ఈ డిమాండ్‌పై ప్రధాని మోదీ నోరు మెదపలేదని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.