Vaccination

 

చరిత్ర సృష్టించిన భారత్..

 

🔹100 కోట్ల టీకాలపై ప్రధాని మోదీ కామెంట్స్..

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ప్రపంచలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి భారత్.. ఇవాళ సరికొత్త మైలు రాయిని అందుకుంది. టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు దాటాయి. వ్యాక్సినేషన్ ప్రారంభించిన కేవలం 9 నెలల్లోనే ఈ రికార్డు ఫీట్‌ను అందుకుంది. జనవరిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన కొత్తలో టీకాల పంపిణీ నెమ్మదిగా జరిగింది. ఇలా అయితే 100 కోట్ల మందికి టీకాలు వేసేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో..? అని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ కేవలం 9 నెలల్లోనే 100 కోట్ల మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించింది భారత్. చైనా తర్వాత 100 కోట్ల డోస్‌ల కరోనా వ్యాక్సిన్ వేసిన రెండో దేశంగా నిలిచింది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ”భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. భారతీయ విజ్ఞానశాస్త్రం విజయాన్ని, 130 కోట్ల మంది భారతీయుల ఐక్యతా స్ఫూర్తిని మనం చూస్తున్నాం. వ్యాక్సిన్ పంపిణీ 100 కోట్ల డోసుల మైలురాయిని దాటిన సందర్భంగా అందరికీ అభినందనలు. వైద్యులు, నర్సులతో పాటు ఈ ఫీట్‌ సాధించేందుకు కారణమైన అందరికీ కృతజ్ఞతలు.” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.”ఇది చారిత్రక, గర్వించదగ్గ క్షణం. నేడు భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలు రాయిని అధిగమించింది. ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన ఈ ఘనత నవ భారత అపార శక్తిసామర్థ్యాలను యావత్ ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది.” అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ ప్రత్యేకమైన రోజును ఘనంగా వేడుకలా జరుపుకునేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని రామప్పతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100 వారసత్వ కట్టడాలకు జాతీయ పతాకంలోని రంగులతో లైటింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇండియాలో 100 కోట్ల వ్యాక్సినేషన్‌పై స్పెషల్ సాంగ్‌తో పాటు వీడియోను రూపొందించారు. దానిని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ విడుదల చేసారు. ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పుతో ఖాదీతో రూపొందించిన భారీ జాతీయ పతాకాన్ని ఎర్రకోట వద్ద ప్రదర్శించారు.