ఎల్ రమణకు కేబినెట్ బెర్త్ ఖాయమేనా.?
🔹టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న ఎల్.రమణ
🔹ఎల్ రమణ విషయంలో గుడ్‌న్యూస్ అంటూ కేసీఆర్
🔹ఎల్ రమణ ద్వారా చేనేత వర్గానికి సేవలన్న కేసీఆర్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఎల్ రమణ తనకు మంచి స్నేహితుడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని ఆయన ప్రశంసించారు. ఎల్ రమణకు మంచి భవిష్యత్ ఉందని తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ రమణకు.. శుక్రవారం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎల్ రమణ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారని సీఎం కేసీఆర్ తెలిపారు. నిబద్ధత గల వ్యక్తి తమ పార్టీలో చేరడం ఎంతో సంతోషమన్నారు. ఎల్ రమణ విషయంలో త్వరలో గుడ్ న్యూస్ వింటారని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఎల్ రమణ రూపంలో ఒక మంచి రాజకీయ నాయకుడిని ప్రజలు చూస్తారని కేసీఆర్ తెలిపారు.
త్వరలోనే చేనేత పెద్దలను పిలిచి మీటింగ్ పెడతామని.. ఏమీ చేస్తే బాగుటుందో చర్చిస్తామన్నారు. చేనేత వర్గంలో నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు ప్రస్తుతం టీఆర్ఎస్‌లో నేతలెవరూ లేరన్నారు. పెద్ద జనాభా, సమస్యలు ఉన్నటువంటి వర్గమని, రాజకీయంగా సరైన ప్రాతినిథ్యం లేదని ఇప్పటికే పలు ప్రయత్నాలు చేశామని కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతోందన్నారు. మరనించిన చేనేత కార్మికులకు బీమా సౌకర్యం, వాళ్లకు కూడా రైతు బీమా లాంటి పథకాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం తెలిపారు. అంతేగాక, చేనేత సామాజిక వర్గానికి చేయాల్సిన సేవలను ఎల్ రమణ ద్వారా అందించేందుకు కృషి చేస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలంతా తన వెంట ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కొద్ది మంది సన్నాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విపక్షాలపై కేసీఆర్ మండిపడ్డారు. వాస్తవానికి తెలంగాణ ఓ బంగారు తునక అని, దేశంలోని మన ప్రభుత్వ ఉద్యోగులు జీతం ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పారు. కోకాపేటలో బూములు అమ్మితే రూ. 2వేల కోట్లు వచ్చాయని, ఈ డబ్బులు సంక్షేమం కోసం ఉపయోగిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మనది ధనిక రాష్ట్రం పేద రాష్ట్రం కాదని మరోసారి ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఎల్ రమణకు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే కేసీఆర్ తన మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.