ktr

 

హుజూరాబాద్ చాలా చిన్న ఎన్నిక – కేటీఆర్

 

అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ-కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని, ఓడిపోయినంత మాత్రాన దుప్పటి కప్పుకుని పడుకోరని, హుజూరాబాద్ ప్రచారానికి తాను వెళ్లడం లేదని మంత్రి అన్నారు. కేసీఆర్ కు ఉపరాష్ట్రపతి పదవి, ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే నుంచి టీఆర్ఎస్ పాఠాలు నేర్చే అంశాలపైనా కేటీఆర్ ఏమన్నారంటే..

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో తాజా రాజకీయాలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక, తెలంగాణ రాష్ట్ర సమితి ద్విశతాబ్ది ఉత్సవాలు, తమిళనాడు డీఎంకే నుంచి గులాబీ దళానికి పాఠాలు, ఎన్నికల్లో గెలుపోటములు.. తదితర అంశాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహిచారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని స్పష్టం చేసిన కేటీఆర్.దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారానికీ వెళ్లలేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ కూడా ఇంకా ఖరారు కాలేదన్నారు. ప్రభుత్వ కలాపాలు, పరిపాలనలో బిజీగా ఉన్నందున పార్టీపై ఫోకస్ పెట్టలేకపోయానని, అయితే రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత సమయాన్ని వెచ్చిస్తానన్నారు. ‘ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యంగా వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ దృష్టిలో చాలా చాలా చిన్న ఎన్నిక. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి బడా నేతనే ఓడించాం. రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా? ఈటల తనకు తానే బీజేపీ అనే బురదను అంటించుకున్నాడు. ఆ బీజేపీ వాళ్లేమో ఈయనను సొంతం చసుకోవట్లేదు. విచిత్రంగా ఎన్నికల ప్రచారంలో జైఈటల అంటున్నారే తప్ప బీజేపీకి అలవాటైన జైశ్రీరాం నినాదం మాత్రం వినిపించట్లేదు. పార్టీ పేరు చెబితే ఓట్లు పడవని తెలుసు కాబట్టే ఈటల పేరుతో సరిపెడుతున్నారు. నిజానికి ఈటలకు టీఆర్ఎస్ ఎంతో చేసింది. ఆయన ఎందుకు రాజీనామా చేశాడో ఇప్పటిదాకా వివరణ ఇవ్వలేదు. పోనీ, గెలిస్తే ఏం చేస్తాడో కూడా చెప్పడంలేదు. హుజూరాబాద్ లో బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కైపోయాయి.

🔹ఓడిపోతే దుప్పటి కప్పుకుంటారా?

ఈటలలో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు కాబట్టే కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. పీసీసీ అధ్యక్షుడిగా తనను తాను నిరూపించుకోవాల్సిన రేవంతే హుజురాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని జోస్యం చెబుతున్నాడు. గతంలో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాన్న సవాలు ఏమైదో అందరం చూశాం. అయినా.. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిస్తే ఓడిపోయిన మోదీ దుప్పటి కప్పుకుని పడుకున్నాడా? హుజూరాబాద్ లో బీజేపీ గెలిస్తే సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావొద్దని ఈటల పెద్దపెద్ద మాటలు అంటున్నాడు. ప్రజల ఆలోచనకు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కచ్చితంగా ప్రతిబింబమే అవుతుంది. హుజూరాబాద్ ఎన్నికలో ఓటమి భయంతోనే విపక్షాలు దళిత బంధు పథకాన్ని అడ్డుకున్నాయి. అయితే నవంబర్ 3 తర్వాత వాళ్లు దాన్ని ఆపలేరు. ఈటలకు ఓటేయాలని ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ లేఖరాయడమేంటి? అక్కడ టీఆర్ఎస్ పార్టీనే గెలవబోతున్నది..

🔹ఉపరాష్ట్రపతిగా కేసీఆర్ ఎందుకంటే..

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడమనేది సమయసందర్భాలను బట్టి ఉంటుంది. ఈ విషయంలో నేను మిగతా వాళ్లలా చిలక జోస్యం చెప్పలేను. బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటై టీఆర్ఎస్, కేసీఆర్ లపై కుట్రలకు తెరలేపారు. కేసీఆర్ ఉప రాష్ట్రపతి కాబోతున్నారనే వార్త వట్టిదే. అది వాట్సాప్ యూనివర్సిటీ చేస్తోన్న ప్రచారం. టీఆర్ఎస్ విజయాలేవీ మీడియాకు కనపడవు. ఒక ప్రాంతీయ పార్టీ 20 ఏళ్లు మనగలగడం చాలా గొప్ప విషయం. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ మాత్రమే ముందుకు పోతున్నాయి. అటు తమిళనాడులోనూ డీఎంకే బలంగా ఉంది. నవంబర్ 15 తర్వాత నేను స్వయంగా అక్కడికి వెళ్లి డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని అధ్యయనం చేసొస్తా.

🔹ఆ రోజు ప్రయాణాలు వద్దు..

పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. నియోజక వర్గాల సన్నాహక సమావేశాలు నిన్న మొదలయ్యాయి. ఈనెల 25న హైదరాబాద్ హైటెక్స్ లో జరగబోయే టీఆర్ఎస్ ప్లీనరీ, నవంబర్ 15న వరంగల్ గడ్డపై జరిగే తెలంగాణ విజయ గర్జన ఏర్పాట్లపై చర్చిస్తున్నాం. ఇంతకు ముందు వరంగల్ లో మేం నిర్వహించిన సభలన్నీ సక్సెస్ అయ్యాయి. నవంబర్ 15న కూడా వరంగల్ కు జనం పోటెత్తుతారు. సభ కోసం 6వేల ఆర్టీసీ బస్సులను వాడుకుంటాం. కాబట్టి ఆ రోజు ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం. కొవిడ్ వాక్సినేషన్ 93 శాతం పూర్తయిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల్లో జోరు పెంచాం. రాబోయే తొమ్మిది నెలల పాటు రకరకాల పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రతిపాదిస్తూ ఇప్పటికే పది సెట్ల నామినేసన్లు దాఖలయ్యాయి..’అని మంత్రి కేటీఆర్ చెప్పారు.