ts cm

 

కృష్ణాలో ఇక నుండి 50 :50

 

🔹రాయలసీమ ఎత్తిపోతలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం

ఏపి నిర్మాణం చేస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ముమ్మాటికి అక్రమ ప్రాజెక్ట్ అని సీఎం స్పష్టం చేశారు..దాన్ని ఎట్టిపరిస్థితుల్లో కూడా తెలంగాణ అంగీకరించదని తీర్మానించారు.ఇందుకు సంబంధించి కేఆర్ఎంబీలో తమ వాదనలను గట్టిగా వినిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఏపి తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులతో పాటు ఇతర అధికారులు పాల్గోన్నారు. ఈ నేపథ్యంలోనే సమీక్ష సమావేశంలో పలు తీర్మాణాలు చేశారు. ముఖ్యంగా నీటి కేటాయింపుతోపాటు పర్యావరణ అనుమతులు కూడా లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వున్నా.. కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని..ఈ సమావేశం తీర్మాణం చేసింది. మరోవైపు జులై 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( కేఆర్ఎంబీ) నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలని కోరింది. ఇందుకు అనుగుణంగానే జులై 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది.. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలని బోర్డును కోరింది. కాగా కృష్ణా నీటిలో ఇప్పటి వరకు వినియోగిస్తున్న 66 : 34శాతం కాకుండా ఈ సంవత్సరం నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలని, కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో ఆంధ్ర తెలంగాణ చెరి సగం అనగా, 405.5 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపేదాకా వినియోగించుకోవాలని సమావేశం తీర్మానించింది. మొత్తం మీద కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి రాజీలేని పోరాటం ఎంతవరకైనా కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది.

ఈ సంధర్భంగా సీఎం కేసిఆర్ మాట్లాడుతూ ప్రకృతి రీత్యా తెలంగాణ భూభాగం సముద్ర మట్టానికి ఎగువన ఉందని అన్నారు. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా కూడా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో లిఫ్టులను ఏర్పాటు చేసుకొని, నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి తెలంగాణ ఉండడంతో. దశాబ్దాల సమైక్య పాలనలో ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. తద్వారా వ్యవసాయాన్ని దండుగలా మార్చి, తెలంగాణ రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. పోరాటం చేసి సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధమ ప్రాధాన్యతగా కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాగునీటి గోసను తీర్చిందని చెప్పారు. దీంతో అత్యధిక దిగుబడులతో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని అన్నారు. ఇదంతా కూడా లిఫ్టుల ద్వారా నదీజలాలను ఎత్తిపోయడం ద్వారా మాత్రమే సాధ్యమైందని వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులను నిర్మించుకోబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. రెండు పంటలకూ నీరందాలంటే.. జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ద్వారా కేటాయించబడిన నీటిని, విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుంటామని తెలిపారు. తెలంగాణ వ్యవసాయం తోపాటు రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతామని అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నదీ జలాలమీద తన పొరుగు రాష్ట్రాలకు కేటాయించబడిన వాటాలను హక్కుగా వినియోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందని, అయితే కేటాయింపులు లేని నికరజలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. దశాబ్దాలపాటు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదనీ, స్వయంపాలనలోనూ అటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితిలో రానివ్వబోమన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏండ్లు కావస్తున్నా, తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటివాటాను నిర్ధారించకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కృష్ణా బేసిన్ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతనే, ఇతర బేసిన్ అవసరాల మీద దృష్టి పెట్టాలనేది సహజ న్యాయమన్నారు. దీన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణ చేపట్టిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల నేపథ్యంలో.. జల విద్యుత్ ఉత్పత్తి అవసరం పెరిగిందన్నారు. జల విద్యుత్ తో లిఫ్టులను నడిపి తద్వారా తెలంగాణ సాగునీటిని ఎత్తిపోసుకుంటుందని సిఎం స్పష్టం చేశారు. సాగునీటితోపాటు, తాగునీటిని తీసుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని కూడా తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జరుపుకుంటుందని, ఇందులో ఎవరూ అభ్యంతరం తెలపడానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ట్రిబ్యునళ్ల ముందు, కేఆర్ఎంబీ వంటి బోర్డుల ముందు, న్యాయస్థానాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ తెలంగాణ ప్రభుత్వం తన వాణిని వినిపిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీ లోపల, బయట అనేకసార్లు ప్రకటించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కూడా నాడు అదే విషయం చెప్పారు. నేడు మాట మార్చి పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరని’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సంయమనంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో చర్చలు జరిపి, వారికి ఇబ్బంది లేని విధంగా, సహకరిస్తూ నిర్మాణం చేసిందని, ఇదే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అవలంభించేందుకు తమ స్నేహ హస్తం అందించామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అయినా వారు పెడచెవిన పెట్టడం పట్ల సిఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.